ఆగస్ట్‌ 1న కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఐపీవో ఆరంభం | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌ 1న కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఐపీవో ఆరంభం

Published Wed, Jul 26 2017 12:53 AM

ఆగస్ట్‌ 1న కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఐపీవో ఆరంభం

ధరల శ్రేణి రూ.424 – 432
ముంబై: ప్రభుత్వరంగ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఐపీవో ఆగస్ట్‌ 1న ప్రారంభం కానుంది. 3వ తేదీతో ముగుస్తుంది. ఒక్కో షేరుకు ఆఫర్‌ ధరల శ్రేణిని రూ.424 – 432గా కంపెనీ ఖరారు చేసింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం రూ.10 ముఖ విలువ కలిగిన 1,13,28,000 షేర్లను విక్రయించనుంది. అలాగే, 2,26,56,000 షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. దీంతో ఐపీవో అనంతరం కంపెనీలో ప్రభుత్వ వాటా 75 శాతానికి తగ్గిపోతుంది. క్రిసిల్‌ నివేదిక ప్రకారం 2015 మార్చి నాటికి కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ప్రభుత్వరంగంలో దేశంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ కంపెనీగా ఉంది.

కాగా, రానున్న ఐదేళ్ల కాలంలో నౌకానిర్మాణం, నౌకా మరమ్మతుల సామర్థ్య విస్తరణకు రూ.3,100 కోట్లు వ్యయం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ‘‘డ్రైడాక్‌ కోసం రూ.1,800 కోట్లు, ఓడల మరమ్మతుల వసతుల కోసం రూ.970 కోట్లు, ప్రస్తుత సామర్థ్యాలను రానున్న ఐదేళ్ల అవసరాలకు అనుగుణంగా పెంచుకునేందుకు రూ.300 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నామని కంపెనీ చైర్మన్, ఎండీ మధు ఎస్‌ నాయర్‌ మంగళవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ఐపీవో ద్వారా సమకూరే నిధులతో 310 మీటర్ల డాక్‌ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా భారీ నౌకా నిర్మాణానికి వీలవుతుందని నాయర్‌ తెలిపారు.

Advertisement
Advertisement