రైతు మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజీలు | Sakshi
Sakshi News home page

రైతు మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజీలు

Published Tue, Oct 9 2018 12:33 AM

Cold Storage in Farmers' Markets - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్‌ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్‌ ఆఫ్‌ కోల్డ్‌ స్టోరేజెస్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్‌ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ గుబ్బ నాగేందర్‌ రావు చెప్పారు.

ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16–17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్‌ చైన్‌ ఎక్స్‌పో, ట్రేడ్‌ షో(ఐసీఈ) వివ రాలను సోమవారం మీడియాకు ఆయన వెల్లడిం చారు. ‘రైతు తీసుకొచ్చిన పంటను ఈ గిడ్డంగుల్లో నిల్వ చేయవచ్చు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పడే విక్రయించుకోవచ్చు. రైతులకు అతి తక్కువ ధరకే కోల్డ్‌ స్టోరేజ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని వివరించారు. ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందన్నారు.

కొత్త గిడ్డంగులొస్తున్నాయ్‌..: దేశవ్యాప్తంగా సు మారు 6,000 కోల్డ్‌ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటిలో 90% యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లో ఉన్నాయి. తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్‌లో 200 దాకా ఉన్నాయి. కొత్త గిడ్డంగికి రూ.1.5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 180 ప్రాజెక్టులు 2018–19లో సబ్సిడీ అందుకోనున్నాయని గ్లోబల్‌ కోల్డ్‌ చైన్‌ అలయన్స్‌ భారత ప్రతినిధి అతుల్‌ ఖన్నా వెల్లడించారు. మల్టీ కమోడిటీ స్టోరేజ్‌ సెంటర్లకు డిమాండ్‌ ఉంటోందని అలయాన్స్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ పూర్ణిమా రావత్‌ చెప్పారు.


గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ విస్తరణ
♦ పౌల్ట్రీ, ఫార్మాలకు గిడ్డంగులు
♦ 2019లో 5 కేంద్రాల ఏర్పాటు
♦  సంస్థ ఎండీ గుబ్బ నాగేందర్‌ రావు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఎండీ గుబ్బ నాగేందర్‌ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి ఉంటాయన్నారు.

ఫార్మా రంగాల కోసం ప్రత్యేకంగా వైజాగ్, గుజరాత్, మహారాష్ట్రలో నిల్వ కేంద్రాలను స్థాపిస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌ సమీపంలో ఫార్మా కోసం రెండు గిడ్డంగులు, సీడ్‌ కంపెనీల కోసం జెర్మ్‌ప్లాసం బ్యాంక్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.

పెట్టుబడి పెడితే చాలు..
కమాడిటీ ట్రేడింగ్‌లో 139 ఏళ్లుగా ఉన్న గుబ్బ గ్రూప్‌ 1987లో తొలి గిడ్డంగిని నెలకొల్పింది. ప్రస్తుతం 17 సెంటర్లను నిర్వహిస్తోంది. ఇందులో 14 మల్టీ కమాడిటీ గిడ్డంగులు. వీటన్నిటి సామర్థ్యం 1,20,000 టన్నులు. సంఖ్య, సామర్థ్యం పరంగా దేశంలో గుబ్బ గ్రూప్‌ అతి పెద్దది.

హైదరాబాద్‌ సమీపంలోని అన్నారం వద్ద 7,000 టన్నుల సామర్థ్యంతో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ కమాడిటీ స్టోరేజ్‌ సెంటర్‌ నవంబరులో ఆరంభమవుతుందని నాగేందర్‌ రావు తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారులు పెట్టుబడి పెడితే చాలు. గిడ్డంగులను నిర్మించి మేమే నిర్వహిస్తాం. భాగస్వామికి ప్రతినెలా ఆదాయం సమకూరుతుంది’ అని చెప్పారు. పాత గిడ్డంగులను కొనుగోలు చేసేందుకూ సిద్ధమన్నారు. కంపెనీలో 230 మంది ఉద్యోగులున్నారు.

Advertisement
Advertisement