పాలసీ లేదని అడ్డుకోవద్దు | Sakshi
Sakshi News home page

పాలసీ లేదని అడ్డుకోవద్దు

Published Wed, Feb 21 2018 12:57 AM

Companies comment on electric vehicles - Sakshi

న్యూఢిల్లీ: పర్యావరణానుకూల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) అభివృద్ధికి పాలసీ లేకపోవడమనేది అడ్డు కాకూడదని పలు వాహన కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ‘మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఈవీ ప్రోగ్రామ్‌లో ఎలాంటి మార్పు లేదు. మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం’ అని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ చెప్పారు. ‘‘ఈవీలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. వీటిని ఎలా రూపొందించాలనే అంశం పరిశ్రమకు సంబంధించింది. ఒకవేళ కంపెనీలు మద్దతు అవసరమని భావిస్తే.. ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెబుతాయి’’  అని పేర్కొన్నారు.

కాగా మారుతీ సుజుకీ 2020 నాటికి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు మహీంద్రా ఎలక్ట్రిక్‌ సీఈవో మహేశ్‌ బాబు కూడా భార్గవ అభిప్రాయాలనే వ్యక్తీకరించారు. ‘ప్రస్తుతం మేం ఎలాంటి అదనపు పాలసీ ప్రోత్సాహకాలు ఆశించడం లేదు. అయితే ఎలక్ట్రిక్‌/హైబ్రిడ్‌ వాహనాలకు మద్దతునివ్వడానికి ప్రవేశపెట్టిన ఫేమ్‌ పథకం, ఈవీలకు సంబంధించిన ప్రత్యేకమైన పన్ను వ్యవస్థ వంటివి కనీసం రెండేళ్లపాటు కొనసాగించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

కాలుష్య నివారణకు, ముడిచమురు దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్రం తీసుకుంటున్న చొరవ అభినందనీయమని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు. 2022 నాటికి ప్రతి మెర్సిడెస్‌ మోడల్‌లోనూ ఒక ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement