ఇలా చేస్తే తెలంగాణ ఆర్థికాభివృద్ధి | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే తెలంగాణ ఆర్థికాభివృద్ధి

Published Thu, Mar 27 2014 1:14 AM

ఇలా చేస్తే తెలంగాణ ఆర్థికాభివృద్ధి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. ఇదంతా సరే. మరిప్పుడు ఏం చేయాలి. రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి సాధించాలి. ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీ పడాలి. పోటీలో ఎలా నిలదొక్కుకోవాలి. ఇక్కడి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. పారిశ్రామికంగా, విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక వసతులు.. ఇలా అన్ని రంగాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. రెండు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమ నిపుణులు చేసిన సూచనల ఆధారంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఒక చర్చనీయాంశ(ఎజెండా) ప్రతిని రూపొందించింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదనలను తప్పనిసరి చేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరుతోంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధిలో తాము భాగస్వామ్యమవుతామని సీఐఐ స్పష్టం చే స్తోంది.

 హైదరాబాద్ వెలుపల..
 పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే తదుపరి అభివృద్ధి రామగుండం, వరంగల్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో చేపట్టాలి. అభివృద్ధి కావాలంటే పారిశ్రామిక వృద్ధి తప్పనిసరి. ప్రతి జిల్లాలో ప్రధాన పరిశ్రమను గుర్తించాలి. నూతన వ్యాపార అవకాశాలను అందుకునేలా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను వెన్నుతట్టాలి. ఉద్యోగిత, వ్యవస్థాపకత ఈ రెండూ కేంద్రంగా విధాన చర్యలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు, పరిశ్రమ, విద్యా నిపుణుల భాగస్వామ్యంతోనే ఆర్థిక వ్యూహాల అమలు. పరిశ్రమలో స్నేహపూర్వక పోటీ. పారిశ్రామికవేత్తలు ఏ ప్రాంతం వారైనా వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు సహృద్భావ వాతావరణం. ఇరు ప్రాంతాల్లో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించాలంటే తెలంగాణ, సీమాంధ్ర మధ్య ఆర్థిక అనుసంధానం కొనసాగాలని సీఐఐ విశ్వసిస్తోంది.

 విద్య, ఉపాధి కల్పన, నైపుణ్యం: 2018-19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో(జీఎస్‌డీపీ) 6 శాతం విద్యకు కేటాయింపు. ప్రైవేటు భాగస్వామ్యంతో టీచర్ ట్రైనింగ్ కళాశాలలు. పనితీరు ఆధారంగా కళాశాలలకు రేటింగ్. కంపెనీలకు ఉద్యోగ కల్పన ఆధారిత ప్రోత్సాహకాలు. ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ వ్యవస్థ నిర్మూలన. ఏకైక సమగ్ర తనిఖీ వ్యవస్థ. పాఠశాలల స్థాయిలోనే పాఠ్యాం శంగా వ్యవస్థాపకత(ఎంట్రప్రెన్యూర్‌షిప్). వీసీ ఫండ్స్‌కు ప్రోత్సాహం. మహిళల ఉద్యోగిత, వ్యవస్థాపకతపై ప్రత్యేక దృష్టి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా నగరాలకు వలసల తగ్గింపు. శిక్షణ ఇచ్చి వ్యవసాయేతర రంగాల్లో అవకాశాల సృష్టి. జిల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం. హార్టికల్చర్, వెటర్నరీ, ఏవియేషన్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కేంద్రాలు.

 ఆరోగ్యం: 2014 నాటికి సార్వజనీన ఆరోగ్య రక్షణ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో(జీఎస్‌డీపీ) 3 శాతం ఆరోగ్య రంగానికి కేటాయింపు. ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రోత్సాహం. ఒక కుటుంబం నుంచి ఏటా రూ.3 వేలకు మించకుండా తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా. ఇది ఆరోగ్యశ్రీకి అదనం.

 మౌలిక వసతులు: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పూర్థి స్థాయి మౌలిక వసతులు. విలేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టాస్క్‌ఫోర్స్. ఇందుకోసం ప్రత్యేకంగా నిధి. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్. హైదరాబాద్-వరంగల్ మధ్య హై స్పీడ్ ట్రైన్లు. హైదరాబాద్-మంచిర్యాల మార్గంలో డబుల్ రైల్వే లైన్, కంటైనర్ డిపోలు. మెట్రో, ఎంఎంటీఎస్, సబర్బన్  ట్రైన్ల విస్తరణ, సామర్థ్యం పెంపు. కాజీపేట, హైదరాబాద్, కర్నూలు, రేణిగుంట మీదుగా ఢిల్లీ-బెంగళూరు ఫ్రైట్ కారిడార్, భువనగిరి(నల్లగొండ)లో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు ఆరు లేన్ల రహదారి. వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం. వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కడప, రేణిగుంట వరకు ఏర్పాటు. మంచిర్యాల నుంచి భద్రాచలం వరకు మరో కారిడార్. జిల్లాకొక గ్రోత్ సెంటర్. సౌర, పవన విద్యుత్ ప్రోత్సాహం. రెండు రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు తక్కువ పన్ను విధింపు. జీఎస్‌టీకి మద్దతు.

 పరిశ్రమలు, విద్యుత్: కొత్త కంపెనీలకు ట్యాక్స్ హాలిడే. ఇప్పటికే ఉన్న కంపెనీలు సామర్థ్యాన్ని 25 శాతం పెంచితే వీటికి కూడా వర్తింపు. భూముల లీజు విషయంలో దీర్ఘకాలిక వ్యూహం. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సరిపడా గ్యాస్ కేటాయింపు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్. ఎంఎస్‌ఎంఈ పునరుజ్జీవనం. వస్త్రాలు/హ్యాండిక్రాఫ్ట్స్ పరిశ్రమకు ప్రత్యేక రాయితీ. కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు ప్రోత్సాహం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటయ్యే ఐటీ సేవల కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. అవసరమైన నిధులు సమకూర్చి ఎంఎస్‌ఎంఈకి ప్రోత్సాహం. అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు. క్లస్టర్లలో వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తులు, నిర్మాణ రంగ ఉత్పత్తులు, వస్త్రాలు, తయారీ యూనిట్లు, లెదర్, టూరిజం ఆధారిత పరిశ్రమల స్థాపన.

Advertisement
Advertisement