ఎస్బీఐ గ్రూప్ విలీనానికి రెడీ | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ గ్రూప్ విలీనానికి రెడీ

Published Wed, May 18 2016 12:13 AM

ఎస్బీఐ గ్రూప్ విలీనానికి రెడీ - Sakshi

అనుబంధ బ్యాంకులతో పాటు బీఎంబీ విలీనానికీ ఎస్‌బీఐ ప్రతిపాదన
ప్రభుత్వ అనుమతి కోరుతూ బోర్డు తీర్మానం
ప్రతిపాదనకు అనుబంధ బ్యాంక్  బోర్డులూ అంగీకారం
కేంద్రం అనుమతిస్తే... వెంటనే చర్చల ప్రక్రియ
నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది: అరుంధతీ భట్టాచార్య

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మంగళవారం కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది. తన ఐదు అనుబంధ బ్యాంకులు అలాగే భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)ని విలీనం చేసుకోడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే (2016-17) ఈ ప్రక్రియ పూర్తవ్వాలన్నది తన ఉద్దేశంగా తెలిపింది. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన దిశలో ఒక అడుగు ముందుకువేసింది. ఎస్‌బీఐ తన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపడానికి ముందు మంగళవారం ఉదయం ఎస్‌బీఐ ఐదు అనుబంధ బ్యాంకు బోర్డులు సైతం విలీనానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ ప్రతిపాదనను చేయడం గమనార్హం. దీనిప్రకారం ప్రభుత్వం  నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదముద్ర పడితే- ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియను ప్రారంభిస్తాయి.

 ఇప్పటికి ప్రతిపాదనే..
కీలక అంశం ప్రస్తుతం ప్రతిపాదన స్థాయిలోనే ఉందని బ్యాంక్ ప్రకటన  తెలిపింది. విలీనాల ప్రక్రియ ఎప్పుడు... ఎలా పూర్తవుతుందన్న అంశాలపై ఇంకా స్పష్టత లేదనీ వివరించింది. చక్కటి కార్పొరేట్ గవర్నెన్స్, పూర్తి పారదర్శకతను నెలకొల్పడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు వివరించింది.  ఒకవేళ ప్రభుత్వం కొన్ని బ్యాంకుల విలీనానికే అనుమతి ఇస్తే... ఏమి చేయాలన్న అంశం సైతం ఇప్పుడు పరిశీలనలో లేదని, ఒకవేళ ఇదే జరిగితే బ్యాంక్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.

 సత్వర చర్యనే కోరుకుంటున్నాం
అరుంధతీ భట్టాచార్య తాజా పరిణామంపై ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ, ప్రస్తుతం ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లని తెలిపారు. ఈ విలీనాలు పూర్తయితే ఈ పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. విలీన ప్రక్రియ సత్వరమే పూర్తవ్వాలని తాము కోరుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, వాటాదారుల ఆమోదంసహా సుదీర్ఘ ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంటుందని అన్నారు. విలీనం జరిగితే నిధుల సమీకరణ వ్యయం ఒక శాతం మేర తగ్గుతుందనీ ఆమె అభిప్రాయపడ్డారు. 2008లో ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది.

 2016-17లోనే బీఎంబీ విలీనం!
భారతీయ మహిళా బ్యాంక్ 2013 సెప్టెంబర్ 25న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెసైన్స్ పొందింది. దాదాపు 100 బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల కథనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే ఎస్‌బీఐలో బీఎంబీ విలీనం జరిగే వీలుంది.

 20న అనుబంధ బ్యాంకుల సమ్మె..
కాగా ఈ అనూహ్య పరిణామంపై కొన్ని ఉద్యోగ సంఘాలూ సత్వరం స్పందించాయి. ఈ విలీన ప్రతిపాదనకు నిరసనగా ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులూ మే 20వ తేదీన సమ్మె చేయాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటన చేశారు.  పేరెంట్ బ్యాంక్ అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని ఉద్యోగ సంఘం విమర్శించింది. ఈ ప్రతిపాదనను వర్క్‌మన్ డెరైక్టర్లు, స్వతంత్ర డెరైక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 23, ఏప్రిల్ 25వ తేదీల్లో సంఘం ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ, అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో కాకుండా, తమలో తాము ఒకటిగా విలీనం కావాలని పేర్కొన్నారని ప్రకటన తెలిపింది. అయితే తాజా ప్రతిపాదన ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఆర్థికమంత్రి అభిప్రాయాలను సైతం పట్టించుకోకుండా తనలో విలీనమయ్యేలా ఐదు అనుబంధ  బ్యాంకులపై ఎస్‌బీఐ ఒత్తిడి తెచ్చినట్లు కనబడుతోందని విమర్శించింది. ఇది అసలు సాధ్యమవుతుందని ప్రశ్నించింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో కూడా ఇదే ధోరణి (ఏకపక్ష విలీనాలు) కొనసాగే అవకాశం కనబడుతోందని పేర్కొన్న సంఘం... దీనికి వ్యతిరేకంగా మరిన్ని ఆందోళనలు జరుపుతామని హెచ్చరించింది.

షేర్ల కదలికలు ఇలా...
తాజా పరిణామం నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఆయా బ్యాంకుల షేర్ల ధరలు చూస్తే..
ఎస్‌బీఐ: 0.17% నష్టపోయి 177.10 వద్ద ముగిసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: 13 శాతం ఎగబాకి రూ.426 వద్ద ముగిసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్: 10 శాతం పెరుగుదలతో రూ.402.50 వద్దకు చేరింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్: 3 శాతం వృద్ధితో 505 వద్ద ముగిసింది.

బ్యాంకులు ఇవీ...
విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంక్ కూడా ఉంది. దీనితోపాటు ఎస్‌బీఐకి చెందిన ఐదు అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ఖ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఎన్‌బీఐ ప్రతిపాదనా పత్రంలో ఉన్నాయి.  ఆయా బ్యాంకుల వ్యాపారం, అప్పులు-ఆస్తులు అన్నీ విలీనపర్చుకోవడమే ఈ ప్రతిపాదన ఉద్దేశం అని ఒక ప్రకటన తెలిపింది. విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు స్టాక్‌మార్కెట్‌లో లిస్టయ్యాయి. వ్యాపార విలీన ప్రక్రియపై చర్చలకు తమ బోర్డులు సూత్రప్రాయ ఆమోదముద్ర వేసినట్లు ఈ మూడు బ్యాంకులూ వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement