నగదు పరిమితుల నుంచి క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు మినహాయింపు | Sakshi
Sakshi News home page

నగదు పరిమితుల నుంచి క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు మినహాయింపు

Published Wed, Jul 5 2017 1:07 AM

నగదు పరిమితుల నుంచి  క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు మినహాయింపు

న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించకూడదన్న పరిమితులపై కేంద్రం స్పష్టతనిచ్చింది. క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు నియమించిన బిజినెస్‌ కరస్పాండెంట్ల లావాదేవీలు, ప్రీపెయిడ్‌ సాధనాలు జారీ చేసే సంస్థలకు దీన్నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఆదాయ పన్ను విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నగదు లావాదేవీల పరిమితి నుంచి అయిదు రకాల సంస్థలకు మినహాయింపు లభిస్తుంది. సహకార బ్యాంకు లేదా బ్యాంకు తరఫున నియమితులైన బిజినెస్‌ కరస్పాండెంట్‌ రూ. 2 లక్షలకు మించి నగదు జమ లావాదేవీలు నిర్వహించవచ్చు.

అలాగే, ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్‌ కార్డులకు సంబంధించి రూ.2 లక్షలకు మించి క్రెడిట్‌ కార్డు కంపెనీలకు నగదు రూపంలో చెల్లించవచ్చు. రూ.2 లక్షల పరిమితి అమల్లోకి వచ్చిన ఏప్రిల్‌ 1 నాటి నుంచే తాజా నిబంధన కూడా అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని జూలై 3 తేదీ నాటి నోటిఫికేషన్‌లో రెవెన్యూ విభాగం పేర్కొంది. నికార్సయిన లావాదేవీలు నిర్వహించే వారికి ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ మినహాయింపులు కల్పిస్తున్నట్లు తెలిపింది. సెక్షన్‌ 269ఎస్‌టీ ప్రకారం ఒక్క రోజులో ఒకటి లేదా అంతకు మించిన లావాదేవీలకు సంబంధించి ఏ వ్యక్తీ రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరపరాదు. దీన్ని ఉల్లంఘిస్తే నగదు అందుకున్న వారు 100 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement