జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ | Sakshi
Sakshi News home page

జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్

Published Mon, Mar 21 2016 1:10 AM

జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్

పీఎస్‌డీఎఫ్ స్కీమ్ కింద ఈ-వేలంలో కేటాయింపు
న్యూఢిల్లీ: గ్యాస్ సరఫరా లేక నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రభుత్వం తాజాగా దిగుమతయ్యే గ్యాస్‌ను కేటాయించింది. ప్రభుత్వ రంగ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ వెబ్‌సైట్ ద్వారా నిర్వహించిన ఈ-వేలంలో రోజుకు 7.72 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) రీ-గ్యాసిఫైడ్ సహజ వాయువు(ఆర్-ఎల్‌ఎన్‌జీ)ను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ గ్యాస్ సరఫరా జరుగుతుంది. దీనిద్వారా 6.79 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. బిడ్డింగ్‌లో రత్నగిరి గ్యాస్ అండ్ పవర్(దబోల్ ప్రాజెక్టు)కు అత్యధికంగా 2.35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ దక్కింది.

కేటాయింపులు జరిగిన ఇతర సంస్థల్లో ల్యాంకో కొండపల్లి పవర్(1.58 ఎంఎంఎస్‌సీఎండీ), జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ(1.09), కోనసీమ గ్యాస్ పవర్(0.71), పయనీర్ గ్యాస్ పవర్(0.55), జీఎంఆర్ వేమగిరి పవర్(0.52), గామా ఇన్‌ఫ్రాప్రాప్(0.35), జీవీకే ఇండస్ట్రీస్(0.32), స్రవంతి ఎనర్జీ(0.25),  ఉన్నాయి. బిడ్డర్లు నెగటివ్ సబ్సిడీ లేదా ఒక్కో యూనిట్‌కు 3 పైసల వరకూ ప్రీమియం రేటును బిడ్ చేయడంతో ప్రభుత్వానికి ఈ-వేలం ద్వారా రూ.18 కోట్ల మేరకు సబ్సిడీ భారం తగ్గనుంది. పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ఫండ్(పీఎస్‌డీఎఫ్) కింద నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు దిగుమతయ్యే గ్యాస్ కొనుగోళ్ల కోసం ఆర్థిక సహకారం అందుతుంది. 2015-16లో రూ. 3,500 కోట్లు, 2016-17లో రూ.4,000 కోట్ల చొప్పున ఈ ఫండ్ నుంచి నిధులను కేటాయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement