రిటైల్‌ రుణాలకు భారీ అవకాశాలు: దీపక్‌ పరేఖ్‌ | Sakshi
Sakshi News home page

రిటైల్‌ రుణాలకు భారీ అవకాశాలు: దీపక్‌ పరేఖ్‌

Published Tue, Mar 21 2017 12:48 AM

రిటైల్‌ రుణాలకు భారీ అవకాశాలు: దీపక్‌ పరేఖ్‌

లండన్‌: రిటైల్‌ రుణాల వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలున్నాయని ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో సంస్థల మధ్య పోటీ సహేతుకంగా లేకపోతే మాత్రం భారీ నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. నిధుల సమీకరణ వ్యయాల కంటే తక్కు వకే రుణాలు ఇచ్చే విషయంలో ఆయనీ హెచ్చరిక చేశారు. రుణాలిచ్చేందుకు భారీ స్థాయి సంస్థలున్నప్పటికీ దేశంలో రిటైల్‌ రుణాల వ్యాప్తి తక్కువగా ఉండడంతో ఈ విభాగంలో మంచి అవకాశాలున్నాయని పరేఖ్‌ లండన్‌లో ఆర్థిక సంస్కరణలపై జరిగిన ఓ సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. ‘‘పోటీ తీవ్రతరమైతే తక్కువ రేటుకే రుణాలను జారీ చేయడం ద్వారా మార్కెట్‌ వాటాను సులభంగా పెంచుకోవచ్చు.

కానీ, ఇతర సంస్థలు కూడా ఈ దిశగా అడుగులు వేసేందుకు ఇది ఒత్తిడికి దారితీస్తుంది. దీంతో తమకు నిధులు సేకరించడానికి అయిన వ్యయానికంటే తక్కువకే రుణాలు ఇవ్వడం ద్వారా సంస్థలు చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని పరేఖ్‌ వివరించారు. జీడీపీలో మార్ట్‌గేజ్‌ నిష్పత్తి దేశంలో 9 శాతమే ఉండగా, ఆసియాలోని ఇతర ప్రముఖ దేశాల్లో ఇది 20–30 శాతంగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘భారత్‌లో కేవలం 2 శాతం మందే ఈక్విటీల్లో మదుపు చేస్తుంటే, అదే చైనాలో 10 శాతం, అమెరికాలో 18 శాతం మంది ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

Advertisement
Advertisement