డెల్ చేతికి ఈఎంసీ కార్పొరేషన్ | Sakshi
Sakshi News home page

డెల్ చేతికి ఈఎంసీ కార్పొరేషన్

Published Tue, Oct 13 2015 12:18 AM

డెల్ చేతికి ఈఎంసీ కార్పొరేషన్

న్యూయార్క్: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్‌కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,35,000 కోట్లు) వెచ్చించి ఈఎంసీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనుంది. తద్వారా ప్రైవేట్ వ్యక్తి సారథ్యంలో అతి పెద్ద టెక్నాలజీ కంపెనీగా ఆవిర్భవించనుంది.  ఒప్పందం ప్రకారం డెల్, దాని వ్యవస్థాపక చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్, సిల్వర్ లేక్ కలిసి ఈఎంసీని కొనుగోలు చేస్తాయి.

ఈఎంసీ డెరైక్టర్ల బోర్డు ఈ డీల్‌కు ఆమోదముద్ర వేసి, షేర్‌హోల్డర్లకు సిఫార్సు చేసింది. ఈఎంసీ షేర్‌హోల్డర్లకు షేరు ఒక్కింటికి 33.15 డాలర్లు విలువ లభిస్తుందని, డీల్ మొత్తం విలువ దాదాపు 67 బిలియన్ డాలర్లు ఉంటుందని డెల్ తెలిపింది. ఈఎంసీ కీలక అనుబంధ సంస్థ వీఎంవేర్ షేరు ధర ప్రాతిపదికన ఒప్పంద విలువను నిర్ధారించారు. ఇందుకు అక్టోబర్ 7న వీఎంవేర్ షేరు ధర 81.78 డాలర్లను పరిగణనలోకి తీసుకున్నారు.

ఒప్పంద నిబంధనల ప్రకారం ఈఎంసీ షేర్‌హోల్డర్లకు 24.05 డాలర్ల మేర నగదు రూపంలోనూ, మిగతాది వీఎంవేర్‌లో ఈఎంసీ పెట్టుబడుల మేరకు స్టాక్స్ రూపంలో లభిస్తుందని డెల్ పేర్కొంది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్కెట్‌లో కీలక విభాగాల్లో దిగ్గజంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని డెల్ చైర్మన్ మైఖేల్ డెల్ తెలిపారు. డేటా సెంటర్, హైబ్రిడ్ క్లౌడ్, మొబైల్, సెక్యూరిటీ తదితర వ్యూహాత్మక విభాగాల్లో భారీ వృద్ధి సాధించగలమని ఈఎంసీ చైర్మన్ జో టుషి పేర్కొన్నారు. ఇటు కస్టమర్లకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, షేర్‌హోల్డర్లకు ఈఎంసీ, డెల్ కలయిక  ప్రయోజనం చేకూర్చగలదని జో తెలిపారు.

Advertisement
Advertisement