పన్ను రేట్లు దిగివస్తాయ్‌! | Sakshi
Sakshi News home page

పన్ను రేట్లు దిగివస్తాయ్‌!

Published Wed, Dec 14 2016 1:00 AM

పన్ను రేట్లు దిగివస్తాయ్‌!

ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సంకేతాలు
పెద్ద నోట్ల రద్దుతో పన్నుల ఆదాయం పెరుగుతుంది
లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను వసూలు చేస్తామని వెల్లడి


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని త్వరలో పన్ను రేట్లు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం సంకేతాలు ఇచ్చారు. డీమోనిటైజేషన్‌ కారణంగా లెక్కల్లో చూపని సంపద నుంచి అధిక మొత్తంలో పన్ను ఆదాయం వ్యవస్థలోకి వస్తే భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష రేట్లు తక్కువ స్థాయికి దిగివస్తాయన్నారు. అనైతిక చర్యలకు పాల్పడేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా భారీ మొత్తాల్లో నగదు సమకూర్చుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, నిఘా సంస్థలు వారిపై కన్నేసి ఉంచాయన్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో కొందరు భారీ మొత్తాల్లో పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకుంటున్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. ఈ విధమైన చర్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఆర్థిక రంగానికి నష్టం చేకూరుస్తాయన్నారు.   

డిజిటల్‌ యుగంలోకి...: ‘‘వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు చాలా వరకు నేడు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చింది. ఈ డిపాజిట్లు అన్నింటినీ లెక్కించాల్సి ఉంది. పన్నులు చెల్లించని నగదు ఉంటే వాటిపై పన్ను వసూలు చేస్తాం’’ అని జైట్లీ వివరించారు. భవిష్యత్తు లావాదేవీలన్నీ డిజిటల్‌ ఆధారితమేనని, నగదు రహిత సమాజం దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. ‘‘ఒక్కసారి ఈ మొత్తం డిజిటల్‌గా మారితే పన్ను వలలో చిక్కుకున్నట్టే. ఫలితంగా ఇప్పటి కంటే భవిష్యత్తులో పన్ను ఆదాయం మరింత పెరుగుతుంది.

దీంతో పన్ను రేట్లను మరింత సహేతుక స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లకూ వర్తిస్తుంది’’అని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు, నగదు వినియోగంపై పాన్‌ నంబర్‌ చూపాలనే ఆంక్షలతో అవినీతి తగ్గుముఖం పడుతుందన్నారు. నగదు వినియోగం తగ్గిస్తే, పన్ను ఎగవేతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పారు.

Advertisement
Advertisement