డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు? | Sakshi
Sakshi News home page

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు?

Published Tue, Oct 27 2015 1:10 AM

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కుదింపు?

మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం...
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్‌మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు.  ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా విక్రయించాలని భావిస్తున్న మొత్తం ఇందులో రూ.41,000 కోట్లు. మిగిలిన రూ. 28,500 కోట్లు వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికి కన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం.  స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు దీనికి కారణం.
 
ఇప్పటివరకూ ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం నాలుగు కంపెనీల ద్వారా మాత్రమే కేంద్రం వాటాలు విక్రయించింది.  పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీల నుంచి జరిగిన ఈ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 12,600 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. 2015-16 లక్ష్యాల ప్రకారం... 20 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం ఉంది.

వీటిలో ఓఐఎల్, నాల్కో, ఎన్‌ఎండీసీ, కోల్ ఇండియా (10 శాతం చొప్పున), ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్ (5 శాతం చొప్పున)లు ఉన్నాయి. ఇటీవలి ఐఓసీ, పీఎఫ్‌సీ డిజిన్వెస్ట్‌మెంట్‌ల విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి.  గత ఐదేళ్లుగా బడ్జెట్ నిర్దేశిస్తున్న స్థాయిల్లో  పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యం నెరవేరకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement