ఒడిదుడుకుల వారం! | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వారం!

Published Mon, May 25 2015 2:43 AM

ఒడిదుడుకుల వారం! - Sakshi

- మార్కెట్‌పై నిపుణుల అంచనా
- మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపు
- కార్పొరేట్ల ఫలితాల తుదిదశ
న్యూఢిల్లీ:
చివరిదశ కార్పొరేట్ ఫలితాలు, మే నెల డెరివేటివ్స్ ముగింపు వంటి అంశాలతో ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేశారు. ఈ వారం బ్లూచిప్ కంపెనీలైన బీహెచ్‌ఈఎల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, గెయిల్, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లాలు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇక మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. వీటి ముగింపు, జూన్ నెలకు జరిగే రోలోవర్స్ కారణంగా మార్కెట్ అటూ, ఇటూ ఊగిసలాడవచ్చన్న అంచనాల్ని నిపుణులు వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరిదశకు వచ్చిందని, ఆయా ఫలితాలకు అనుగుణంగా షేర్లు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఆర్థిక వృద్ధికి కీలకమైన రుతుపవనాల కదలికల్ని మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుందని ఆయన చెప్పారు.

ఆర్‌బీఐ వైపు చూపు....: రేట్ల కోతపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయంపై అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. జూన్ 2న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష వుంటుంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం వంటి కారణాలతో ఆర్‌బీఐ ఈ దఫా సమీక్షలో రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని ఆయన చెప్పారు.

గతవారం మార్కెట్...: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత ఫలితంగా గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 27,957 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 946 పాయింట్లు వృద్ధిచెందింది. అదేతీరులో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 197 పాయింట్ల లబ్దితో 8,459 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు క్రితం వారం ర్యాలీ జరిపాయి.
 
ఎఫ్‌పీఐల విక్రయాలు 14,000 కోట్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మే నెలలో ఇప్పటివరకూ స్టాక్, డెట్ మార్కెట్లలో రూ. 14,000 కోట్ల నికర విక్రయాలు జరిపారు. రూ. 5,867 కోట్ల విలువైన షేర్లను, రూ. 8,807 కోట్ల విలువైన రుణపత్రాల్ని విక్రయించడంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 14,674 కోట్లకు చేరినట్లు డేటా వెల్లడిస్తున్నది. పన్నుల సమస్య, అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరగడం, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి అమ్మకాలకు కారణమని విశ్లేషకులంటున్నారు.

Advertisement
Advertisement