తెరుచుకోనున్న ప్రైవేటు బంకులు | Sakshi
Sakshi News home page

తెరుచుకోనున్న ప్రైవేటు బంకులు

Published Sun, Oct 19 2014 12:42 AM

రిలయన్స్

డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో రెడీ అవుతున్న కంపెనీలు

కలిసొస్తున్న ముడి చమురు ధరల తగ్గింపు
నాలుగు నెలల్లో 25% తగ్గిన ధరలు
ప్రస్తుత ధరలో డీజిల్‌పై లీటరుకు రూ. 3.5 వరకు లాభం
గతంలో నష్టాలు తట్టుకోలేక 3,000 ప్రైవేట్ ఔట్‌లెట్స్ మూసివేత

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోవడంతో ప్రైవేటు ఆయిల్ రిఫైనరీ కంపెనీలు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడిచమురు ధర కూడా కలిసిరావడంతో గతంలో  మూసేసిన ఔట్‌లెట్లను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నాయి. గత నాలుగు నెలల్లో ముడి చమురు ధరలు 25 శాతం తగ్గడమే కాకుండా రూపాయి మారకం విలువ కూడా స్థిరంగా కదులుతుండటంతో ఆయిల్ రిటైలింగ్ వ్యాపారంపై ప్రైవేటు కంపెనీలకు ఆశలు చిగురిస్తున్నాయి.

ఇప్పటికే ఎస్సార్ ఆయిల్, మంగళూరు రిఫైనరీలు ఔట్‌లెట్లను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించగా, రిలయన్స్ పాత డీలర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సార్ ఆయిల్ వచ్చే మూడేళ్లలో ఔట్‌లెట్ల సంఖ్యను 1,400 నుంచి 3,000కి పెంచే ఆలోచనలో ఉన్నామని చెప్పగా, ఓఎన్‌జీసీ అనుబంధ కంపెనీ మంగళూరు రిఫైనరీ ‘టోటల్’ పేరుతో ఈ రంగంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 500 బంకులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

డీజిల్‌పై తొలిగిన నియంత్రణ
ఇప్పటిదాకా చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీలు నష్టాలను తట్టుకోలేక మూసేసిన సంగతి తెలిసిందే. రిలయన్స్, ఎస్సార్ ఆయిల్, షెల్ కంపెనీలు 2008లో సుమారు 3,000 ఔట్‌లెట్లను కలిగి ఉండగా, వాటిని క్రమంగా మూసివేశాయి. తర్వాత పెట్రోల్, గ్యాస్ ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో కొన్ని బంకులు తిరిగి తెరుచుకున్నాయి.

ఇప్పుడు డీజిల్‌పై కూడా నియంత్రణ ఎత్తివేయడంతో భారీ ఎత్తున ఈ రంగంలోకి ప్రవేశించే యోచనలో కంపెనీలున్నాయి. డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు (ఇండియన్ బాస్కెట్) 87 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం డీజిల్‌పై లీటరుకు రూ.3.50 వరకు కంపెనీలకు లాభాలు వస్తాయి. డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో ఈ రంగంలోకి ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున ప్రవేశించడం ద్వారా పోటీ పెరిగి అంతిమంగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఎస్సార్ ఆయిల్ ఎండీ సీఈవో ఎల్.కె.గుప్తా పేర్కొన్నారు.

రిలయన్స్ కంపెనీ డీజిల్ ఔట్‌లెట్లను ప్రారంభించడానికి చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే కానీ, కమీషన్‌పైనే ఇంకా తుది నిర్ణయానికి రాలేదని రిలయన్స్ చమురు డీలర్ ‘సాక్షి’తో అన్నారు. వాహనాల అమ్మకాలు పెరగుతుండటంతో డీజిల్, పెట్రోల్‌కు డిమాండ్ బాగుందని, దీంతో ప్రైవేటు కంపెనీలు ప్రవేశించినా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ డీలర్లకు ఎటువంటి నష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పీఎస్‌యూ ఆయిల్ డీలర్ల ప్రెసిడెంట్ ప్రభాకర్ పేర్కొన్నారు.

కానీ ప్రైవేటు కంపెనీలకు ఇచ్చే ఔట్‌లెట్ల సంఖ్య, కమీషన్లపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ కంపెనీలకు చెందినవి 42,000 ఔట్‌లెట్లు ఉన్నట్లు అంచనా. ముందు ముందు రూపాయి విలువ కూడా బలపడే అవకాశాలు ఉండటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడంతో ప్రభుత్వ కంపెనీలు కూడా విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి. రానున్న కాలంలో కొత్తగా మరో 16,000 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement