డివిడెండ్‌ కావాలా..! | Sakshi
Sakshi News home page

డివిడెండ్‌ కావాలా..!

Published Tue, Apr 16 2019 12:14 AM

Dividend income for holders of UK shares jumps to record £19.7bn - Sakshi

ఎవరూ క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌లు భారీగా ఐఈపీఎఫ్‌ఏ వద్ద పేరుకుపోతున్నాయి.  దాదాపు రూ.2,000 కోట్ల విలువైన క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌ చెల్లింపులు ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీ(ఐఈపీఎఫ్‌ఏ) వద్ద ఉన్నాయి. అలాగే క్లెయిమ్‌ చేయని షేర్లు కూడా రూ.19,000 కోట్ల మేర ఈ సంస్థ వద్ద ఉన్నాయని అంచనా.  29.5 లక్షల మంది ఇన్వెస్టర్లు రూ.19,000 కోట్ల విలువైన షేర్లను క్లెయిమ్‌ చేసుకోలేదని అంచనా.  

25 లక్షల వాటాదారులకు  అందని డివిడెండ్‌లు.. 
సాధారణంగా కంపెనీలు డివిడెండ్‌లు ప్రకటిస్తాయి. రికార్డ్‌ తేదీలోపు తమ ఖాతా పుస్తకాల్లో ఉన్న వాటాదారులకు డివిడెండ్‌ను చెల్లిస్తాయి. డీమ్యాట్‌ ఖాతాలున్న ఇన్వెస్టర్లకు డివిడెండ్‌లు వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి. అయితే కాగితం రూపం (షేర్‌ సర్టిఫికెట్‌) వాటాదారులకు మాత్రం డివిడెండ్‌లు చెల్లింపు కొంచెం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారమే. ఇక ఎవరూ క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌లను కంపెనీలు ఈ సంస్థకు బదిలీ చేస్తాయి. ఇలా ఐఈపీఎఫ్‌ఏకు దాదాపు 25 లక్షలకు పైగా వాటాదారులకు చెందాల్సిన రూ.2,000 కోట్ల విలువైన డివిడెండ్‌లు బదిలీ అయ్యాయి. షేర్లు డీమ్యాట్‌ రూపంలో కాకుండా కాగితం రూపంలో ఉన్న ఇన్వెస్టర్లే ఈ 25 లక్షల మంది ఇన్వెస్టర్లలో అధికంగా ఉంటారని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు.. చాలా షేర్లు కాగితం రూపంలో ఉన్నాయని, మరణించిన వారి షేర్లు వారి వారి వారసులకు బదిలీ చేయకపోవడం వల్లనే ఈ స్థాయిలో డివిడెండ్‌ చెల్లింపులు పేరుకుపోయాయని ఆ అధికారి వివరించారు. కాగా కాగితం రూపంలో ఉన్న అన్ని షేర్లను డీమ్యాట్‌ రూపంలోకి తప్పనిసరిగా మార్చుకోవాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. కాగితం రూపంలో ఉన్న షేర్లు డీమ్యాట్‌రూపంలోకి మారడానికి ఈ నెల 31ను గడువు తేదీగా సెబీ నిర్దేశించింది. 

క్లెయిమ్‌ చేసుకోవచ్చనీ తెలీదు: అసలైన వాటా దారు మరణించిన తర్వాత వారి వారసులకు షేర్ల బదిలీ  జరగడం లేదని, అందుకే ఇలా డివిడెండ్‌లు పేరుకుపోతున్నాయని  అలంకిత్‌ సంస్థ ఎమ్‌డీ అంకిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఐఈపీఎఫ్‌ఏ వద్ద పేరుకుపోయిన డివిడెండ్‌లను సంబంధిత ఇన్వెస్టర్లు పొందడానికి అలంకిత్‌ సంస్థ సాయం చేస్తోంది. ఒక వేళ షేర్ల బదిలీ జరిగినా, సంతకాలు సరిగ్గా మ్యాచ్‌ కాకపోవడం వల్ల, చాలా మంది షేర్‌ సర్టిఫికెట్లను పోగొట్టుకోవడం వల్ల కూడా అన్‌క్లెయిమ్డ్‌ డివిడెండ్‌లు పేరుకుపోతున్నాయని తెలిపారు. కాగా ఐఈపీఎఫ్‌ఏ వద్ద పోగుపడిన డివిడెండ్లను క్లెయిమ్‌ చేసుకొని పొందవచ్చనే విషయం కూడా చాలా మందికి తెలియదని నిపుణులంటున్నారు.  

సెన్సెక్స్‌ షేర్ల డివిడెండ్‌లూ అన్‌క్లెయిమ్‌డే... 
ఏదో ఊరు, పేరులేని కంపెనీల, లేదా ఆషామాషీ కంపెనీల డివిడెండ్‌లే కాకుండా, సెన్సెక్స్‌ కంపెనీల డివిడెండ్‌లు కూడా ఈ సంస్థ వద్ద పేరుకుపోవడం విశేషం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 3,329 మంది భారతీ ఎయిర్‌టెల్‌ వాటాదారులు రూ.11 లక్షల విలువైన డివిడెండ్‌లను క్లెయిమ్‌ చేసుకోలేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  ఇదే ఆర్థిక సంవత్సరంలో హీరో మోటా కార్ప్‌కు చెందిన రూ.8 కోట్ల డివిడెండ్‌లు కూడా ఈ సంస్థ వద్ద పోగుపడ్డాయి. ఇక ఐటీసీ విషయానికొస్తే, దాదాపు రూ.32 కోట్ల డివిడెండ్‌లను ఎవరూ ఆ ఏడాది క్లెయిమ్‌ చేయలేదు. ఓఎన్‌జీసీ డివిడెండ్‌ల విషయంలో 2,000కు పైగా ఇన్వెస్టర్లు డివిడెండ్లను క్లెయిమ్‌ చేయలేదు. బజాజ్‌ ఆటో విషయంలో డివిడెండ్‌లు క్లెయిమ్‌ చేయని ఇన్వెస్టర్ల సంఖ్య 1,500 వరకూ ఉంది. ఈ క్లెయిమ్‌ చేయని డివిడెండ్‌ల విలువ
రూ.4 కోట్ల వరకూ ఉంటుంది.

అన్‌క్లెయిమ్డ్‌ షేర్ల విలువ రూ.19,000 కోట్లు 
కంపెనీల చట్టం, 2013, సెక్షన్‌125 కింద కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐఈపీఎఫ్‌ఏను 2016లో ఏర్పాటు చేసింది. ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడం, నిధుల పరిరక్షణ నిమిత్తం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. షేర్ల రిఫండ్, అన్‌క్లెయిమ్‌డ్‌ డివిడెండ్‌లు, మెచ్యూరైన డిపాజిట్లు, డిబెంచర్లు ఈ సంస్థ ఆధీనంలోకి వస్తాయి. ఏడేళ్లుగా ఎవరూ క్లెయిమ్‌ చేయని షేర్లను ఐఈపీఎఫ్‌ఏకు బదిలీచేయాలని ప్రభుత్వం గతేడాది కంపెనీలను ఆదేశించింది. ఈ ఆదేశాల పర్యవసానంగా ఇప్పటివరకూ 1,355కంపెనీలు 48.6 కోట్ల షేర్లను బదిలీ చేశాయి. వీటి విలువ రూ.19,000 కోట్లుగా అంచనా.  ఇక గత ఏడాది కాలంలో ఐఈపీఎఫ్‌ఏ మొత్తం రూ.2 కోట్ల డివిడెండ్లను మాత్రమే రీఫండ్‌ చేయగలిగింది.
 

ఐఈపీఎఫ్‌ఏ నుంచి  డివిడెండ్‌ క్లెయిమ్‌ ఇలా... 
►ఐఈపీఎఫ్‌ఏ వెబ్‌సైట్‌లో లభించేఫామ్‌–5 దరఖాస్తును నింపాలి.  
►ఇండెమ్నిటీ బాండ్,  ఇతర నిర్ధారణ డాక్యుమెంట్లను జత చేసి, కంపెనీ రిజిస్టర్డ్‌ ఆఫీస్‌కు పంపాలి.  
►ఈ క్లెయిమ్‌ దరఖాస్తులను కంపెనీ వెరిఫై చేస్తుంది. 15 రోజుల్లోఐఈపీఎఫ్‌ఏకు నివేదిక పంపిస్తుంది. 
► కంపెనీ నివేదిక ఆధారంగా ఐఈపీఎఫ్‌ఏ డివిడెండ్‌లను ఎలక్ట్రానిక్‌ రూపంలో సదరు ఇన్వెస్టర్‌కు 60 రోజుల్లో చెల్లిస్తుంది. 

Advertisement
Advertisement