క్లిక్ చేస్తే డాక్టర్! | Sakshi
Sakshi News home page

క్లిక్ చేస్తే డాక్టర్!

Published Sat, Oct 15 2016 1:00 AM

క్లిక్ చేస్తే డాక్టర్!

కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఐక్లినిక్
మన దేశంతో పాటూ 150 దేశాల్లో సేవలు
రూ.15 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : నర్సింగ్ సేవలు అక్కర్లేదు. పరీక్షలూ అక్కర్లేదు. కేవలం డాక్టర్ కన్సల్టేషన్ దొరికితే చాలు. మరి దానికోసం వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిందేనా? లేదంటే వైద్యుడిని ఇంటికి పిలవాల్సిందేనా? అదేమీ అవసరం లేదంటోంది ఐక్లినిక్. ఇండియాతో పాటు అమెరికా, సింగపూర్, జర్మనీ ఇలా 160 దేశాల్లో సేవలందించే స్థాయికి ఎదిగిన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు... తమిళనాడుకు చెందిన ధృవ్ సుయంప్రకాశం ఏమంటారంటే...

రూ.5 లక్షల పెట్టుబడితో 2012లో ఐక్లినిక్.కామ్‌ను ప్రారంభించాం. 160 దేశాల్లో ఎక్కడైనా, డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ కల్పించడమే ఐక్లినిక్ ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే వైద్యులకు, పేషెంట్లకు మధ్య వారధిలా ఉంటుంది ఐక్లినిక్.

ప్రస్తుతం మా వద్ద 1,500 మంది వైద్యులు రిజిస్టరై ఉన్నారు. ఇందులో 80 మందికి పైగా డాక్టర్లు స్పెషలిస్టులే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 200 మంది డాక్టర్లు నమోదయ్యారు. ఇప్పటివరకు 2 లక్షల మంది మా సేవలను పొందారు. అమెరికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎక్కువ కన్సల్టేషన్ కాల్స్ వస్తున్నాయి.

వెబ్‌సైట్, యాప్ ద్వారా మాత్రమే కాకుండా టెలిగ్రాం, ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ ద్వారా మా సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా పేషెంట్లు తమ వైద్య రిపోర్ట్‌లను, మందుల చీటీలను వైద్యుడికి పంపిస్తూ నేరుగా సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్యాకేజీలను బట్టి చార్జీ ఉంటుంది. ప్రారంభ ధర రూ.99.

⇔  ప్రతి కన్సల్టేషన్‌కు కమీషన్ రూపంలో ఫీజు తీసుకుంటాం. ఉదాహరణకు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.100 అనుకుంటే.. అందులో రూ.29 కమీషన్ తీసుకొని మిగిలింది వైద్యుడికి చెల్లిస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 280 శాతం వృద్ధిని నమోదు చేశాం.

ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే డాక్టర్ మదన్ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టారు. సహ వ్యవస్థాపకుడి హోదాలో సేవలందిస్తున్నారు. మరో 6 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరిస్తాం. ఇద్దరు పీఈ ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం కూడా.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement
Advertisement