ఐపాడ్ తో ఆన్ లైన్ సర్జరీ | Sakshi
Sakshi News home page

ఐపాడ్ తో ఆన్ లైన్ సర్జరీ

Published Wed, May 25 2016 12:58 PM

ఐపాడ్ తో ఆన్ లైన్  సర్జరీ

ఎక్కడో ఉన్న నిపుణులైన అంతర్జాతీయ డాక్టర్లను, మరోచోటికి రప్పించి సర్జరీలు చేపట్టడం చాలా కష్టం. ఒక్కోసారి వారు రాలేకపోవచ్చు. సర్జరీ చేయడానికి వారు కచ్చితంగా అవరమవచ్చు. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ గాజాలో ఓ రిమోట్ సర్జరీని ఐపాడ్ తో చేసి చూపించారు అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ డాక్టర్లు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా డాక్టర్లు సర్జరీలు నిర్వర్తించేలా అద్బుతమైన టెక్నాలజీతో ఈ సర్జరీ చేశారు. ప్రాక్సిమి అనే కొత్త సాప్ట్ వేర్ సాయంతో, ఐపాడ్ స్క్రీన్ తో ఈ ఆపరేషన్ చేశారు. స్క్రీన్ పై సర్జికల్ ఫీడ్ ను చూసుకుంటూ, దాన్ని కెమెరాలో బంధించి, ఎక్కడ కత్తెరతో కోసి కుట్లు వేయాలో ఆస్థలాన్ని స్క్రీన్ పై నిర్దేశిస్తూ.. సర్జరీ చేశామని అమెరికన్ యూనివర్సిటీ బేరూత్ మెడికల్ సెంటర్ ప్లాస్టిక్ సర్జరీ అధినేత డాక్టర్. గాసన్ అబూ సితా తెలిపారు. గుండెను తాకకుండానే గుండె సర్జరీ కూడా చేయొచ్చని తెలిపారు.

గాజా స్ట్రిప్ లో ప్రాక్సిమి సాప్ట్ వేర్ సాయంతో అబూ సితా ఇప్పటికీ రెండు పెద్ద ఆపరేషన్లు చేశారు. పేలుడు తాలూకు గాయాలకు ఎలా ఆపరేషన్ చేయాలో వందమైళ్ల దూరంనుంచే తన కొలిగ్స్ కు మార్గనిర్దేశం చేస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ప్రొసీజర్లకు రెండు స్మార్ట్ ఫోన్లు లేదా టాబ్లెట్లు అవసరమవుతాయని, వాటిని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసి, ఆపరేషన్ ను లైవ్ కెమెరా ఫీడ్ తీసుకోవాలని చెప్పారు. సర్జరీయన్ దాన్ని చూస్తూ.. ఎక్కడైతే కుట్లు అవసరమవుతాయో ఆ స్థలంలో డివైజ్ పై మార్కు చేస్తారు. అలా ఆపరేషన్ స్థలంలో ఉన్న డాక్టర్లకు సహకరించవచ్చన్నారు. ఈ మార్కుల ద్వారా గాజా ఆపరేషన్ స్థలంలో ఉన్న తన కొలిగ్స్ , తాను నిర్దేశిస్తున్న మేరకు కుట్లు వేస్తూ సర్జరీ చేపట్టారని డాక్టర్ అబూ సితా తెలిపారు. ఈ టెక్నాలజీ మెడికల్ విద్యార్థులకు కూడా ఎంతో సహకరిస్తుందని, వారు లైవ్ ఆపరేషన్ తో ఎలా సర్జరీ నిర్వర్తించవచ్చో తెలుసుకోవచ్చన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మెడికల్ నిపుణల ద్వారా కూడా సర్జరీలకు సంబంధించిన పూర్తి వివరాలను  ఆన్ లైన్ లో పొందవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement