మార్కెట్‌పై ‘ఫెడ్’ మేఘాలు..! | Sakshi
Sakshi News home page

మార్కెట్‌పై ‘ఫెడ్’ మేఘాలు..!

Published Mon, Aug 29 2016 12:57 AM

మార్కెట్‌పై ‘ఫెడ్’ మేఘాలు..! - Sakshi

వడ్డీరేట్ల పెంపు దిశగా ఫెడ్ చీఫ్ యెలెన్ వ్యాఖ్యల ప్రభావం...
* విశ్లేషకుల అంచనా...

న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు పెరిగాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం సోమవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో పాటు  ఈ వారంలో విడుదలయ్యే గణాంకాలు, ఐఓసీ, బీపీసీఎల్, డీఎల్‌ఎఫ్ వంటి కొన్ని కంపెనీలు క్యూ1 ఫలితాలు, రిలయన్స్ ఏజీఎమ్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు తదితర అంశాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
 
ప్రతికూలంగా మార్కెట్...
రేట్లు పెంచే అవకాశాలున్నాయంటూ ఫెడ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. ఫెడ్ రేట్ల పెంపు భారత్ వంటి వర్థమాన దేశాలకు మంచిది కాదని, అందుకని యెలె న్ వ్యాఖ్యల ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా  జూలై నెల ఎనిమిది కీలక రంగాల పనితీరు గణాంకాలు ఈ నెల 31(బుధవారం)వెలువడనున్నాయి.  

ఇక ఆగస్టు నెల భారత తయారీ రంగ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ గురువారం (సెప్టెంబర్ 1న) వెల్లడించనున్నది. భారత తయారీ రంగానికి సంబంధించి ఈ నెలవారీ సర్వే ప్రభావం మార్కెట్‌పై ఉంటుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా వెల్లడించారు.
 
వాహన షేర్లపై దృష్టి...: ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలను వివిధ వాహన కంపెనీలు సెప్టెంబర్ 1న(గురువారం) వెల్లడించనున్నందున వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, విమానయాన రంగ షేర్లు వెలుగులోకి రావచ్చు.
 
కంపెనీల క్యూ1 ఫలితాలు
ఇక డీఎల్‌ఎఫ్, ఎంఓఐఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొ, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ తదితర కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను ఈ వారమే వెల్లడించనున్నాయి. నేడు (సోమవారం) డీఎల్‌ఎఫ్, ఎంఓఐఎల్, ఐఓసీ,  ఈ నెల 31న (బుధవారం) బీపీసీఎల్ తమ క్యూ1 ఫలితాలను ప్రకటిస్తాయి. ఐఓసీ బోనస్ షేర్లజారీని సోమవారమే ప్రకటించే అవకాశముంది. సెప్టెంబర్ 1న(గురువారం) జరిగే రిలయన్స్ ఏజీఎమ్‌లో రిలయన్స్ జియో కార్యకలాపాల ఎప్పుడు ప్రారంభించేది వెల్లడవుతుందని, ఈ రిలయన్స్ ఏజీఎమ్ కీలకమని నిపుణులంటున్నారు.
 గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 295 పాయింట్లు క్షీణించి 27,782 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 8,573పాయింట్ల వద్ద ముగిశాయి.
 
జోరుగా విదేశీ నిధులు ..
భారత స్టాక్‌మార్కెట్లో విదేశీ నిధుల ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.8,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందడం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను తగ్గించడం వంటి జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల కారణంగా భారత్‌లోకి విదేశీ నిధులు జోరుగా వస్తున్నాయని నిపుణులంటున్నారు.

డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 25వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.8,127 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.2,727 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ  ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో రూ.39,905 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.7,450 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి భారత క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.32,455 కోట్లుగా ఉన్నాయి.

Advertisement
Advertisement