ట్రంప్‌తో మన ఐటీకి ఊహించని మేలు..! | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో మన ఐటీకి ఊహించని మేలు..!

Published Thu, Feb 16 2017 1:35 AM

ట్రంప్‌తో మన ఐటీకి ఊహించని మేలు..! - Sakshi

దేశీ మార్కెట్‌పై దృష్టి పెట్టేందుకు అవకాశం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ


ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణాత్మక విధానాలతో దేశీ ఐటీ రంగానికి ఊహించని మేలే జరగవచ్చని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీలు దేశీ మార్కెట్లో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు తోడ్ప డగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ రక్షణాత్మక ధోరణులు భారత ఐటీ రంగంతో పాటు యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ట్రంప్‌ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు. అతి పెద్ద మార్కెట్‌ అయిన మన దేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమ.. ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

సంపన్న దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటాన్ని పట్టించుకోనవసరం లేదని.. దేశీ పరిశ్రమలు దేశ సామర్థ్యాన్ని పెంపొందించడంపైనే దృష్టి సారించాలని అంబానీ సూచించారు. ప్రస్తుతం డిజిటైజేషన్‌ ప్రపంచంలో అపార అవకాశాలు ఉన్నాయని వీటిని అందిపుచ్చుకోవాలంటే భాగస్వామ్యాల ద్వారానే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ‘ప్రపంచం మన చుట్టూ అడ్డుగోడలు కట్టేందుకు ప్రయత్నించవచ్చు. కానీ ఆ పరిణామాల గురించి మనం ఆందోళన చెందకుండా ఉండటం ముఖ్యం’  అని ఆయన సూచించారు. ఇప్పటికే పది కోట్ల యూజర్ల మైలురాయి అధిగమించిన రిలయన్స్‌ జియో ప్రస్తుతం భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉందని అంబానీ తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను ధృవీకరణకు ఆధార్‌ ఆధారిత విధానాన్ని పాటించడం వల్లే ఈ ఫీట్‌ సాధ్యపడిందన్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ప్రయోజనాలను కోట్ల మందికి అందుబాటులోకి తేవడం, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడటం లక్ష్యంగా పెట్టుకోవాలని అంబానీ సూచించారు. డిజిటల్‌ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో ప్రైవసీ, భద్రత, డేటా చౌర్యంపరమైన సవాళ్లు అనేకం ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరించగలిగితే అడ్డంకులన్నీ అధిగమించగలమని, సమస్యలన్నింటికీ తగు పరిష్కారాన్ని కనుగొనగలమని చెప్పారు.  

వెఫల్యాలు ఎదురైనా వెనుతిరగలేదు..
వ్యాపారవేత్తగా విజయం సాధించాలంటే ఇన్వెస్టర్ల సొమ్మును మన డబ్బుకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలని, సరైన టీమ్‌ ఉండాలని, తక్షణ ప్రయోజనాల ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలని అంబానీ సూచించారు. వ్యాపార విధానాల గురించి తన తండ్రి ధీరూభాయ్‌ అంబానీ నుంచి తొలి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.  వ్యాపారాల్లో వైఫల్యాలు సర్వసాధారణమేనని అంబానీ చెప్పారు. తాను కూడా విజయాలు సాధించడానికి ముందు వ్యక్తిగతంగా అనేక వైఫల్యాలు చవిచూశానని తెలిపారు.

నాలుగో పారిశ్రామిక విప్లవానికి డేటానే ఇంధనం..
ప్రస్తుతం డిజిటల్‌ సాంకేతికత నాలుగో పారిశ్రామిక విప్లవంగా ప్రపంచాన్ని చుట్టేస్తోందని అంబానీ చెప్పారు. దీనికి డేటానే ’కొత్త ఇంధనం’గా మారిందన్నారు. ‘నాలుగో పారిశ్రామిక విప్లవానికి పునాదులు కనెక్టివిటీ, డేటానే. డేటానే మనకినప్పుడు సరికొత్త సహజ వనరు. ఇదే కొత్త ఇంధనంగా మనం కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం’ అని అంబానీ పేర్కొన్నారు. దీనిలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీకి సంబంధించి 2015లో అత్యంత దిగువన 155వ స్థానంలో ఉన్న భారత్‌ను.. రాబోయే రోజుల్లో టాప్‌–10లోకి చేర్చేందుకు తమ జియో సేవలు తోడ్పడగలవని అభిప్రాయపడ్డారు.

నాస్కామ్‌ వృద్ధి అంచనాలు వాయిదా..
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక పాలసీ విధానాల  నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌.. వచ్చే ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలను మే నెలలో ప్రకటించే అవకాశముంది. ‘ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ రంగ అంచనాలను వచ్చే త్రైమాసికంలో అంటే దాదాపుగా మే నెలలో ప్రకటిస్తాం. కస్టమర్లు, పరిశ్రమ సంబంధిత నిపుణులతో లోతుగా చర్చించాల్సి ఉంది’ అని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. ట్రంప్‌ అక్కడ పాలసీ విధానాల్లో మార్పులు తీసుకొస్తుండటంతో పలు సవాళ్లు ఎదురుకానున్నాయని తెలిపారు. అదేవిధంగా గ్లోబల్‌ ఐటీ వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు వృద్ధితో 5%కి చేరుతాయనే అంచనాలు సానుకూల అంశమన్నారు. నాస్కామ్‌ 2016–17 ఏడాది ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 10–12% నుంచి 8–10%కి సవరించింది. 

హెచ్‌1బీ వీసాలపై ఆందోళన వద్దు: టీసీఎస్‌ చంద్రశేఖరన్‌
హెచ్‌1బీ వీసా సమస్యలను గోరంతలు కొండంతలుగా చేయడం జరుగుతోందని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ చీఫ్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. 155 బిలియన్‌ డాలర్ల దేశీ ఐటీ పరిశ్రమ దీనిపై అనవసర ఆందోళనలకు లోను కావొద్దని, ఇప్పుడు కూడా అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణపరమైన మార్పులు ఏ కాస్త జరిగినా.. లేదా ఏ చిన్న సవాలు ఎదురవ్వొచ్చని అనిపించినా.. మన పరిశ్రమ.. అంతా కూడా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది’ అని గోరంతలు కొండంతలుగా చెప్పుకోవడం జరుగుతోంది. అది హెచ్‌1బీ వీసాల విషయం కావొచ్చు లేదా మరోటి కావొచ్చు’ అని చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. ప్రాథమికంగా ప్రతి వ్యాపారానికి టెక్నాలజీనే ఊతం కానున్న నేపథ్యంలో సాంకేతికతకు అవకాశాలు.. డిమాండ్‌ గణనీయంగానే ఉండగలదని ఆయన చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement