బిహార్ డైలమా-హెచ్చుతగ్గుల మార్కెట్ | Sakshi
Sakshi News home page

బిహార్ డైలమా-హెచ్చుతగ్గుల మార్కెట్

Published Sat, Nov 7 2015 1:31 AM

బిహార్ డైలమా-హెచ్చుతగ్గుల మార్కెట్

* చివర్లో సూచీలు డౌన్     
* నెలరోజుల కనిష్టస్థాయి
ముంబై:  బిహార్ ఎన్నికల ఫలితాల పట్ల ఇన్వెస్టర్లు అయోమయంలో పడటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వివిధ ఎగ్జిట్ పోల్స్ విభిన్నంగా వుండటంతో కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్లు, గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు జరిగాయి. దాంతో రోజంతా సూచీలు ఎగుడుదిగుడులకు లోనయ్యాయి.

26,439-26,190 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల నష్టంతో 26,265 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 8,003-7,926 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య కదలాడి, చివరకు 1 పాయింటు స్వల్పనష్టంతో 7,954 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకు ఇది నెలరోజుల కనిష్టస్థాయి.

గత 10 ట్రేడింగ్ సెషన్లలో భారత్ సూచీలు క్షీణించడం ఇది తొమ్మిదవసారి. బిహార్ ఎన్నికలలో స్పష్టమైన విజేత ఎవరో ఎగ్జిట్ పోల్స్ తేల్చకపోవడంతో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయని బీఎన్‌పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవాల్కర్ చెప్పారు. వెలుగులో పీఎస్‌యూ బ్యాంకులు
 సూచీలు చివరకు నష్టాల్లో ముగిసినా, మార్కెట్ వేళల్లో ఆర్థిక ఫలితాలు వెల్లడించిన మూడు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి.

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించడంతో 3.86 శాతం ఎగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం అనూహ్యంగా క్షీణించడంతో ట్రేడింగ్ తొలిదశలో 10 శాతంపైగా నష్టపోయింది. దాదాపు ఏడాది కనిష్టస్థాయి అయిన రూ. 140 వద్ద ఆ షేరుకు భారీ కొనుగోలు మద్దతు లభించడంతో ఆ స్థాయి నుంచి వేగంగా 15 శాతంవరకూ ర్యాలీ జరిపి రూ. 168 స్థాయికి పెరిగింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫలితాలు అంచనాలకంటే మెరుగ్గా వుండటంతో 2.5 శాతం పెరిగింది.  ఓరియంటల్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కూడా 2-3 శాతం పెరిగాయి.

Advertisement
Advertisement