కుట్ర ఆరోపణలు అవాస్తవం | Sakshi
Sakshi News home page

కుట్ర ఆరోపణలు అవాస్తవం

Published Wed, May 15 2019 8:50 AM

Drugmakers Collude on Generic Price Hikes overcharge consumers - Sakshi

న్యూఢిల్లీ: ఔషధాల ధరల విషయంలో కస్టమర్ల ప్రయోజనాలు దెబ్బతీసేలా జనరిక్‌ ఫార్మా సంస్థలు కుమ్మక్కయ్యాయంటూ అమెరికాలో కేసులు దాఖలు కావడాన్ని దేశీ ఫార్మా దిగ్గజాలు ఖండించాయి. ధరల నిర్ణయించడంలో కుట్ర కోణాలున్నాయన్న ఆరోపణలను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌), వోకార్డ్, అరబిందో, గ్లెన్‌ మార్క్‌ తదితర సంస్థలు ఖండించాయి. ఈ మేరకు కంపెనీలన్నీ వేర్వేరుగా తమ వివరణను స్టాక్‌ ఎక్సే్చంజీలకు సమ ర్పించాయి. ఈ ఆరోపణలను దీటుగా ఎదుర్కోనున్నామని డీఆర్‌ఎల్‌ తెలిపింది. అయిదు జనరిక్‌ ఔషధాలకు సంబంధించి అమెరికాలోని తమ అనుబంధ సంస్థపై కుట్ర ఆరోపణలు వచ్చాయని వివరించింది. అయితే, కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై ప్రస్తుతానికి ఈ పరిణామాల ప్రభావమేదీ ఉండబోదని స్పష్టం చేసింది.

అరబిందో ఇలా...
అటు మరో దిగ్గజం అరబిందో ఫార్మా కూడా తమపై దాఖలైన రెండో కేసులో  ఆరోపణలను తోసిపుచ్చింది. వీటిని ఖండిస్తూ త్వరలోనే ఫెడరల్‌ కోర్టుకు వివరణనివ్వనున్నట్లు తెలిపింది. 116 జనరిక్‌ ఔషధాల ధరల విషయంలో కుమ్మక్కుగా వ్యవహరించాయంటూ 21 జనరిక్‌ ఔషధాల కంపెనీలు, 15 మంది వ్యక్తులపై అమెరికాలోని 49 రాష్ట్రాల అటార్నీస్‌ జనరల్‌.. కనెక్టికట్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశాయి. రెండో కేసులో తమ సంస్థ పేరు కాకుండా అనుబంధ సంస్థ టారా ఫార్మా పేరుందని సన్‌ ఫార్మా వివరణనిచ్చింది. ఈ ఆరోపణలను గట్టిగా ఎదుర్కొంటామని తెలిపింది. గ్లెన్‌మార్క్‌ కూడా తమపై ఆరోపణలను ఖండించింది.

Advertisement
Advertisement