‘ఇక్సిగో’తో ఈజీ ప్రయాణం | Sakshi
Sakshi News home page

‘ఇక్సిగో’తో ఈజీ ప్రయాణం

Published Sat, Mar 18 2017 1:30 AM

‘ఇక్సిగో’తో ఈజీ ప్రయాణం

ట్రావెల్, హోటల్‌ బుకింగ్‌ సంస్థలన్నీ ఒకే చోట
25 వేల ట్రావెల్‌; 10 లక్షల హోటల్‌ బుకింగ్‌ సంస్థలతో ఒప్పందం
‘స్టార్టప్‌ డైరీ’తో ఇక్సిగో సీఈఓ అలోక్‌ బాజ్‌పాయ్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రారంభ పెట్టుబడి రూ.30 లక్షలే. ఆరంభించింది ఇద్దరే. కానీ ఐదారేళ్లు తిరిగేసరికి ఈ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 100 దాటిపోయింది. రూ.100 కోట్ల పెట్టుబడులూ వచ్చాయి. ఇక ఆదాయమైతే 30 కోట్లు దాటిపోయిందంటే... ఈ స్టార్టప్‌ సక్సెస్‌ను అర్థం చేసుకోవచ్చు. దేశ, విదేశాల్లోని ట్రావెల్‌ వెబ్‌సైట్లు, హోటల్‌ బుకింగ్‌ సంస్థల్ని ఒకే వేదికపైకి తెచ్చిన ఆ కంపెనీయే... ‘ఇక్సిగో’. ఈ ట్రావెల్‌ అగ్రిగేటర్‌ విజయమెలా సాధించిందన్నది దాని వ్యవస్థాపకుడు, సీఈఓ అలోక్‌ బాజ్‌పాయ్‌...

‘సాక్షి’ స్టార్టప్‌ డైరీతో పంచుకున్నారు. వివరాలివీ...
ఆన్‌లైన్‌లో క్యాబ్, బస్సు, రైలు లేక విమాన టికెట్లను బుకింగ్‌ చేయాలంటే... వాటిలో పేరున్న రెండు మూడు వెబ్‌సైట్లలోకి వెళ్లి చూస్తాం. ఒకే టికెట్‌ను ఏ సంస్థలు ఎంత ధర చెబుతున్నాయో తెలుసుకోవాలంటే అన్ని సైట్లూ చూసి కొనక తప్పదు. మరి దేశ, విదేశాల్లోని ట్రావెల్, హోటల్‌ బుకింగ్‌ సంస్థలన్నీ ఒకే వేదికపై తెలుసుకుంటే..? సమయం ఆదా అవటమే కాకుండా.. తక్కువ ధరకే టికెట్‌నూ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో సరిగ్గా ఇలాంటి సేవల వేదికే.. ‘ఇక్సిగో.కామ్‌’! ఏకంగా 25 వేల ట్రావెల్‌ వెబ్‌సైట్లు, 10 లక్షలకు పైగా హోటల్‌ బుకింగ్‌ సంస్థలున్నాయిందులో!!

‘‘ఐఐటీ కాన్పూర్‌ నుంచి ఇంజనీరింగ్‌ చేశాక స్పెయిన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం సంస్థ అమెడియస్‌లో నాలుగున్నరేళ్లు పనిచేశా. ఆ సమయంలో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి దేశీ ట్రావెల్‌ పరిశ్రమలో వస్తున్న మార్పుల గురించి తెలిసింది. దీన్ని అందుకోవాలంటే సొంత కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుని... రజినీష్‌ కుమార్‌తో కలిసి రూ.30 లక్షల పెట్టుబడితో 2007లో గుర్గావ్‌ కేంద్రంగా ఇక్సిగో.కామ్‌ను ప్రారంభించా. అప్పటికే దేశంలో ట్రావెల్‌ టికెట్‌ బుకింగ్‌ సంస్థలు చాలా ఉన్నాయి. అందుకే అగ్రిగేట్‌ విధానాన్ని ఎంచుకున్నాం. అంటే దేశ, విదేశాల్లోని ట్రావెల్, హోటల్‌ బుకింగ్‌ సంస్థలన్నింటితో ఒప్పందం చేసుకున్నాం. దీంతో క్యాబ్స్, బస్సు, విమాన టికెట్లు ఏవైనా సరే బుకింగ్‌ చేసేముందు ఎక్కడ తక్కువ ధర ఉందో తెలుసుకోవచ్చు. ఇక్సిగో నుంచే బుక్‌ చేసుకోవచ్చు కూడా.

25 వేల ట్రావెల్‌ సంస్థలు..: ఇక్సిగో.కామ్‌ వెబ్‌సైట్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్‌ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన విమాన, బస్సు, క్యాబ్, రైలు టికెట్‌ బుకింగ్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రతి టికెట్‌ బుకింగ్‌పై సంస్థ నుంచి 5–10% కమీషన్‌ తీసుకుంటాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 65 నగరాల్లో బస్సు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌ అవసరం లేకుండా క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇటీవలే 10 నగరాల్లో ఇంటర్‌సిటీ క్యాబ్‌ బుకింగ్‌ సేవలనూ ప్రారంభించాం. పర్యాటకులకు ఆయా ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు ఇక్సిబాబా, ఇక్సిబుక్‌లను కూడా ప్రారంభించాం.

రూ.30 కోట్ల ఆదాయం..
ఏటా 5 కోట్ల మంది ఇక్సిగో ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. ఇందులో 10% వాటా తెలుగు రాష్ట్రాలది. గతేడాది మా ఒప్పంద సంస్థలకు మా ద్వారా రూ.650 కోట్ల గ్రాస్‌ మర్చండెస్‌ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఈ ఏడాది రెండింతలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.12 కోట్ల టర్నోవర్‌ చేశాం. ఈనెలతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.30 కోట్లకు చేరనున్నాం. మా మొత్తం వ్యాపారంలో 12–13% వాటా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలదే.

వారంలో రూ.65 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో వంద మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు సైఫ్‌ పార్టనర్స్, మైక్రోమ్యాక్స్, మేక్‌మై ట్రిప్‌ సంస్థలు రూ.97 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ‘‘కొత్తగా మరో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన సికోయా క్యాపిటల్, చైనాకు చెందిన ఫోసన్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఈ పెట్టుబడులు పెడుతున్నాయి. పూర్తి వివరాలను వారం రోజుల్లో వెల్లడిస్తాం’’ అని అలోక్‌ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement
Advertisement