ఇట్జ్‌క్యాష్‌లో ఈబిక్స్‌కు వాటాలు | Sakshi
Sakshi News home page

ఇట్జ్‌క్యాష్‌లో ఈబిక్స్‌కు వాటాలు

Published Thu, May 25 2017 12:53 AM

ఇట్జ్‌క్యాష్‌లో ఈబిక్స్‌కు వాటాలు

80% వాటాకి రూ. 800 కోట్లు
ముంబై: ఇన్సూరెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఈబిక్స్‌ తాజాగా పేమెంట్స్‌ కంపెనీ ఇట్జ్‌క్యాష్‌లో 80 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.800 కోట్లు వెచ్చించింది. ఈ డీల్‌తో ఇట్జ్‌క్యాష్‌ నుంచి ప్రస్తుత ఇన్వెస్టర్లు మ్యాట్రిక్స్‌ పార్ట్‌నర్స్, లైట్‌స్పీడ్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్, ఇంటెల్‌ క్యాపిటల్‌ తమ వాటాలు విక్రయించి వైదొలిగినట్లవుతుంది. ఈబిక్స్‌కు కొత్త షేర్లు కూడా జారీ చేయనున్నట్లు ఇట్జ్‌క్యాష్‌ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ భవిక్‌ వాసా తెలిపారు. కంపెనీ ప్రమోటరు ఎస్సెల్‌ గ్రూప్‌ దగ్గర మిగతా 20 శాతం వాటాలుంటాయి.

ఇన్వెస్టర్లంతా కూడా 3–5 రెట్లు రాబడులతో వైదొలిగినట్లు వాసా తెలియజేశారు. అయితే, ప్రమోటరు ఎస్సెల్‌ గ్రూప్‌ ఎంత వాటా విక్రయించినదీ వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఇట్జ్‌క్యాష్‌.. 2016–17లో లాభాల బాట పట్టిందని, గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయాలపరంగా ఏటా 35% వృద్ధి సాధిస్తోందని భవిక్‌ చెప్పారు. ప్రస్తుతం 75,000 పాయింట్స్‌ ఆఫ్‌ ప్రెజెన్స్‌ ఉన్నాయని, కొత్తగా వచ్చే నిధులతో వీటి సంఖ్యను వచ్చే మార్చి నాటికి లక్షకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement