రిలయన్స్ గ్యాస్ షాక్! | Sakshi
Sakshi News home page

రిలయన్స్ గ్యాస్ షాక్!

Published Mon, Mar 24 2014 12:28 AM

రిలయన్స్ గ్యాస్ షాక్! - Sakshi

న్యూఢిల్లీ: అసలే గ్యాస్ ధర రెట్టింపు కావడంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... మరింత ఆజ్యంపోసే చర్యలకు తెరతీసింది. కేజీ-డీ6 క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ సరఫరా కాంట్రాక్టుల్లో భారీ మార్పులు చేపట్టింది. దీంతో గ్యాస్ ధర కొత్త రేటు కంటే 10% పెరిగేందుకు దారితీయనుంది. ప్రస్తుతం దేశీ సహజవాయువు రేటు ఒకో బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 4.2 డాలర్లుకాగా, ఏప్రిల్ 1 నుంచి ఇది రెట్టింపుస్థాయిలో 8.3 డాలర్లకు పెరగనున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల సరఫరా కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త గ్యాస్ విక్రయ-కొనుగోలు ఒప్పందాలను(జీఎస్‌పీఏ) ఎరువుల తయారీ ప్లాంట్లకు ఆర్‌ఐఎల్ పంపింది. ఇందులో బిల్లింగ్ విధానాన్ని పూర్తిగా మార్చివేసేలా ప్రతిపాదనలు చేసింది.

ఇప్పుడు యూనిట్ గ్యాస్‌కు 4.205 డాలర్ల ధరపై నికర కెలోరిఫిక్ విలువ(ఎన్‌సీవీ) ప్రాతిపదికన బిల్లింగ్ జరుగుతుండగా... ప్రభుత్వం నిర్ధారించిన కొత్త రేటుపై స్థూల కెలోరిఫిక్ విలువ(జీసీవీ) ఆధారంగా బిల్లింగ్ చేసేలా రిలయన్స్ జీఎస్‌పీఏలో మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సహజవాయువును మండించడం ద్వారా వచ్చే ఉష్ణాన్ని కెలోరిఫిక్ విలువల్లో కొలుస్తారు. ఒక జీసీవీ అంటే 0.9 ఎన్‌సీవీకి సమానం. ఇప్పుడు కొత్త ధర 8.3 డాలర్లపై ఎన్‌సీవీ ఆధారిత బిల్లింగ్‌ను అమలు చేస్తే యూరియా ప్లాంట్లకు ఒక్కో ఎంబీటీయూ రేటు 9.13 డాలర్లకు ఎగబాకనుంది.

 యూరియా ప్లాంట్ల గగ్గోలు...
 ఇప్పటికే రెట్టింపు గ్యాస్ ధర కారణంగా తమపై తీవ్ర భారం పడుతుందని గగ్గోలు పెడుతున్న యూరియా ప్లాంట్లకు రిలయన్స్ మరో 10 శాతం రేటు పెంపు ప్రతిపాదనలు శరాఘాతంగా మారనున్నాయి. ఆర్‌ఐఎల్ రేటు పెంపు ప్రతిపాదనపై ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఏఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ఎరువుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో ఆర్‌ఐఎల్ కొత్త జీఎస్‌పీఏల్లో చేపట్టిన మార్పుల అంశాన్ని చమురు శాఖకు నివేదించామని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

  యూరియా ఉత్పత్తి వ్యయంలో దాదాపు 80% గ్యాస్‌దే. యూనిట్ గ్యాస్ ధర 1 డాలరు పెరిగితే ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.1,369 చొప్పున ఎగబాకుతుంది. ప్రస్తుతం గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్న 1.8 కోట్ల టన్నుల యూరియాకు దీన్ని లెక్కగడితే ఒక డాలరు రేటు పెంపు వల్ల రూ.2,465 కోట్ల అదనపు భారం పడుతుంది. గ్యాస్ ధర రెట్టింపు కావడంతో యూరియా ప్లాంట్లకు ఉత్పత్తి వ్యయం రూ.9,860 కోట్లు పెరిగిపోనుంది. రిలయన్స్ జీసీవీ విధానం వల్ల దీనికి మరో రూ.2,046 కోట్ల భారం జతకానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement