మెగా స్కాం: నీరవ్‌మోదీ ఎపుడో చెక్కేశాడు | Sakshi
Sakshi News home page

మెగా స్కాం: నీరవ్‌మోదీ ఎపుడో చెక్కేశాడు

Published Thu, Feb 15 2018 8:36 PM

ED writes to the Ministry of External Affairs seeking revocation of passports - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్కాంలో మనీ లాండరింగ్  ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి సంబంధించి ఆసక్తికరవిషయం వెలుగు చూసింది.  నీరవ్ మోసపూరిత లావాదేవీలపై ఎఫ్ఐఆర్ దాఖలు కాకముందే దేశాన్ని విడిచి వెళ్లిపోయాడని విదేశాంగ శాఖ ప్రకటించింది. సీబీఐ మొదటి ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే అంటే జనవరి 1 నే నీరవ్‌మోదీ స్విట్జర్లాండ్‌కు చెక్కేశాడు.  అతని సోదరుడు నిశాల్‌మోదీ(బెల్జియన్‌ సిటిజన్‌) భార్య అమి మోదీ (అమెరికన్‌  సిటిజన్‌) కూడా ఆ రోజే విదేశీ విమానం ఎక్కేశారు. అయితే ప్రధాన వాటాదారుడు , గీతాంజలి  జ్యెవెలరీ ప్రమోటర్‌ మెహుల్‌ చోస్కీ జనవరి 6న  దేశం విడిచాడని అధికారులు చెప్పారు.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జనవరి 29న సీబీఐ కి ఫిర్యాదు చేయగా.. రూ. 280 కోట్ల  అవినీతి కేసులో జనవరి 30న  సీబీఐ కేసు నమోదు   చేసింది.

ఆర్థిక శాఖ  స్పందన
మరోవైపు తాజా పరిణామాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ సీరియస్‌గా స్పందించింది.  పీఎన్‌బీలో మెగా స్కాం వెలుగు చూడటం గవర్నెన్స్‌ లోపాలను వెల్లడించిందని శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యాక్సిస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌,ఎస్‌బీఐలోని పాలనా లోపాలను  ప్రస్తావించారు. అలాగే సంబంధిత  ఖాతాలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాల్సిందిగా ఆదేశించింది.

ఈడీ, ఆర్‌బీఐ సీరియస్‌
అలాగే  నీరవ్‌ మోదీ, ఆయన భార్య,  మెహుల్‌ చోక్సీ పాస్‌పోర్టులు రద్దు చేయాల్సిందిగా ఈడీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ  ప్రయత్నాల్లో  విదేశాంగ శాఖ ఉంది.  అటు మార్చి 2018నాటికి మొత్తం రూ.11వేల కోట్లను చెల్లించాల్సిందేనని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పీఎన్‌బీను ఆదేశించింది. దీంతో గురువారం నాటి మీడియా సమావేశంలో  నిందితులను శిక్షస్తాం,   వాటాదారుల సొమ్ముకు ఢోకాలేదంటూ డ్యామెజ్‌ కంట్రోల్‌ చేసుకున్నప్పటికీ తాజా పరిణామాలతో  బ్యాంకు మరింత చిక్కుల్లో పడింది.

రూ.5100 కోట్ల ఆస్తులు సీజ్‌
నీరవ్‌ మోదీకి చెందిన రూ. 5100 కోట్ల డైమండ్‌, బంగారు ఆభరణాలను సీజ్‌ చేసినట్టుఈడీ ప్రకటించింది. అలాగే 3.9 కోట్ల బ్యాంక్‌  బాలెన్స్‌తోపాటు ఇతర  డిపాజిట్లనుకూడా సీజ్‌ చేసినట్టు  తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ముంబై బ్రాంచ్ కు సంబంధించిన రూ.11,400 కోట్ల భారీ స్కామ్ లో నీరవ్ మోదీ, ఆయన భార్య,సోదరుడు, మరో భాగస్వామి ప్రధాన వాటాదారుడు మెహుల్‌ చోస్కీ నిందితులు. పీఎన్బీ ఇచ్చిన హామీలతో వీళ్ళు ఆరు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ముంబై, ఢిల్లీ, సూరత్ నగరాల్లో నీరవ్  కుటుంబానికి చెందిన 17 కార్యాలయాలమీద ఈడీ సోదాలు   నిర్వహిస్తోంది.

కాగా 2017 లో తమ బ్యాంకును రూ. 280 కోట్ల మేర బురిడీ కొట్టించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ ఇదివరకే దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.  రూ.5 వేల కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు 6 నెలల గడువు కావాలని నీరవ్ కోరినట్టు సమాచారం.  అటు ఈ వ్యవహారంలో  ఇప్పటివరకూ 18మంది అధికారులను  పీఎన్‌బీ  సస్పెండ్‌ చేసింది.  ఈ అవినీతి గురించి ఈడీకి రిపోర్ట్‌ చేసిన మొదటి బ్యాంకు పీఎన్‌బీ.

Advertisement

తప్పక చదవండి

Advertisement