మండు వేసవిలో చల్లగా! | Sakshi
Sakshi News home page

మండు వేసవిలో చల్లగా!

Published Sat, Apr 16 2016 10:35 PM

మండు వేసవిలో చల్లగా!

ఫాల్స్ సీలింగ్‌తో ఇల్లు ఆహ్లాదం

సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ భగ్గుమంటోంది. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’!

ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా.

జాగ్రత్తలివే..

ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.
ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.
ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలిం గ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.

 వర్ణాల ఎంపికలో..
ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే..

గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.

తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.

గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.

 స్థిరాస్తులకు సంబంధించి  మీ సందేహాలు మాకు రాయండి.
realty@sakshi.com

Advertisement

తప్పక చదవండి

Advertisement