డెట్‌ఫండ్స్ కన్నా ఎఫ్‌డీలు మిన్న

10 Aug, 2014 01:08 IST|Sakshi
డెట్‌ఫండ్స్ కన్నా ఎఫ్‌డీలు మిన్న

 అన్ని రేట్లూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో .. ఇటీవలి పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. మరోవైపు, మార్కెట్ ఆధారిత డెట్ ఫండ్స్‌పై మాత్రం కొత్త నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటిదాకా ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపించిన డెట్ ఫండ్స్ వన్నె తగ్గింది. చాలా మంది ఎఫ్‌డీలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్‌డీలే సురక్షితం అన్న భావన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం.

 ఇన్వెస్టరు ప్రధాన లక్ష్యం.. తాను పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండటం, రాబడులు రావడం, పెట్టిన పెట్టుబడి వృద్ధి చెందడం. ప్రస్తుతం ఎన్ని కొత్త సాధనాలు వస్తున్నప్పటికీ.. ఏ ఇన్వెస్టరైనా ప్రధానంగా వాటిలో ముందుగా చూసేది ఈ మూడు అంశాలే. అందుకే మనలో చాలా మంది తమ కష్టార్జితాన్ని బ్యాంకు డిపాట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

అయితే, ప్రస్తుతం ఈ కోవకి చెందిన సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చర్చనీయాంశంగా మారాయి. రిస్కు అంటే అస్సలు ఇష్టపడని వారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో అర్థంగాక సతమతమవుతున్నారు. రిస్కు తీసుకునే సామర్థ్యం, రాబడి అంచనాలు, కాలవ్యవధి లాంటి అంశాలను బట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలా లేక ఫండ్స్‌ని ఎంచుకోవాలా అన్నది వ్యక్తిగతమైన అభిప్రాయాలపై ఆధారపడి ఉండే విషయం. అయినప్పటికీ .. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు మంచిదన్నది తెలియజెప్పేందుకు ఈ ప్రయత్నం.

  స్వల్పకాలికం.. దీర్ఘకాలికం..
 దీర్ఘకాలికంగా మంచి రాబడులు ఇస్తాయని మ్యూచువల్ ఫండ్స్‌కి పేరున్నప్పటికీ.. స్వల్ప కాలిక వ్యవధి విషయంలో వీటికి అంతగా మార్కులు పడవు. ఎందుకంటే ఫండ్స్ అనేవి.. మార్కెట్స్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. ఫలితంగా స్వల్పకాలిక వ్యవధిలో ఒకవేళ మార్కెట్ల పరిస్థితి గానీ బాగా లేకుంటే రాబడి సంగతి అటుంచి కొన్ని సార్లు పెట్టిన పెట్టుబడిలో సింహభాగం రాకుండా పోయే అవకాశాలూ ఉన్నాయి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయం తీసుకుంటే.. స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా రాబడి గ్యారంటీగా ఉంటుంది. వీటిపై వడ్డీ రేట్లు ఆయా కాల వ్యవధికి సంబంధించి స్థిరంగా ఉండటమే ఇందుకు కారణం. ఎఫ్‌డీల్లో ‘నష్టం’ అన్న పదం వినిపించదు. ఇన్వెస్టరుకు అన్ని రకాల ప్రయోజనం చేకూర్చే సాధనం ఇది.

  పెట్టుబడులపై స్థిరమైన రాబడులు..
 బ్యాంకు డిపాజిట్ల కింద ఇన్వెస్ట్ చేసేటప్పుడే నిర్దిష్ట శాతం మేర రాబడులు ఉంటాయని ఇన్వెస్టరుకు బ్యాంకు ముందుగానే చెబుతోంది. ఉదాహరణకు మీరు అయిదేళ్ల కాల వ్యవధి కోసం 9 శాతం వార్షిక వడ్డీ రేటు లెక్కన రూ. 50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం కాలవ్యవధిలో మీకు అదే వడ్డీ రేటు కొనసాగుతుంది. అంతే తప్ప తగ్గదు. అదే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. కచ్చితమైన రాబడి రేటు ఉండదు. ఎందుకంటే.. ఇవి పూర్తిగా మార్కెట్‌పైనా, ఫండ్ పనితీరుపైనా ఆధారపడి ఉంటాయి.

మనీ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు .. సదరు ఫండ్ ఎన్‌ఏవీలపై ప్రభావం చూపుతాయి. దీంతో రాబడులు మారిపోతుంటాయి. కనుక చెప్పొచ్చేదేమిటంటే..  మార్కెట్లు ఎలా ఉన్నా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ముందుగా అనుకున్న రాబడి మాత్రం కచ్చితంగా చేతికొస్తుందన్న గ్యారంటీ ఉంటుంది.

  లిక్విడిటీ..
 ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కాస్త దీర్ఘకాలిక లాకిన్ వ్యవధి ఉన్నప్పటికీ... అవసరమైతే స్వల్ప పెనాల్టీతో (సుమారు 1 శాతం) ముందస్తు విత్‌డ్రాయల్స్‌కు చాలా మటుకు బ్యాంకులు అనుమతిస్తాయి. ఇలాంటప్పుడు ఎన్నాళ్ల పాటు డబ్బును ఇన్వెస్ట్ చేశారన్న దానిపై వడ్డీ రేటును లెక్క గట్టి ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ స్వల్ప వ్యవధిలో ఎన్ని యూనిట్లయినా రిడీమ్ చేసుకోవచ్చు. ఆ రోజున సదరు ఫండ్ ఎన్‌ఏవీని బట్టి ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయల్‌పై రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే, ఫండ్స్‌లో ఏడాది వ్యవధికన్నా ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం మేర ఎగ్జిట్ లోడు పడుతుంది.

  రిస్కు తక్కువ..
 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడనేది.. మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకోసారి పెట్టిన దానికన్నా కూడా తక్కువ మొత్తం చేతికొచ్చే అవకాశాలూ ఉంటాయి. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో అలాంటి రిస్కులు ఉండవు. ఇన్వెస్ట్ చేసిన వారు ఉద్యోగి అయినా... రిటైరయిన వ్యక్తయినా సరే.. స్థిరంగా, రెగ్యులర్‌గా ఆదాయం అందిస్తాయి.

  ఇన్వెస్ట్ చేసినందుకు ఖర్చులూ ఉండవు
 బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే.. దానికి సంబంధించి అదనపు ఖర్చులేమీ ఉండవు. అదే  ఫండ్ విషయానికొస్తే రాబడులు ఎలా ఉన్నా సరే.. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ వ్యయాల కింద కనీస చార్జీలను ఇన్వెస్టరే భరించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు రాబడి వచ్చినా రాకున్నా.. లేదా అసలు మొత్తానికే ఎసరు వచ్చినా.. మీరు మాత్రం ఫండ్ నిర్వహణ ఫీజులను భరించాల్సిందే. కాని బ్యాంకు డిపాజిట్లలో ఎటువంటి ఫీజులు ఉండవు. ఫండ్స్‌తో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో ఇన్వెస్టరుకు అదనపు వ్యయాలంటూ ఉండవు. ఎఫ్‌డీ అనేది కచ్చితమైన రాబడులు అందించాల్సిందే.

 ఏదైతేనేం.. సగటు ఇన్వెస్టరు కష్టార్జితంపై రాబడులు అందించే సురక్షిత సాధనం ఫిక్స్‌డ్ డిపాజిట్. స్వల్పకాలికమైనా.. దీర్ఘకాలికమైనా ఇందులో పెట్టుబడికి భద్రత ఉంటుంది. అలాగే, ఇన్వెస్టరు, వారి కుటుంబానికి ఆర్థికపర మైన భరోసా కూడా లభిస్తుంది.

మరిన్ని వార్తలు