ఫెడ్ ప్రకటనపై ముందు జాగ్రత్త | Sakshi
Sakshi News home page

ఫెడ్ ప్రకటనపై ముందు జాగ్రత్త

Published Thu, Mar 19 2015 1:26 AM

ఫెడ్ ప్రకటనపై ముందు జాగ్రత్త - Sakshi

114 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- లాభాల స్వీకరణ మరో కారణం
- నిఫ్టీ నష్టం 37 పాయింట్లు
- 8,700 దిగువకు నిఫ్టీ
- మార్కెట్  అప్‌డేట్

వడ్డీరేట్లపై ఫెడ్  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త కారణంగా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలపాలయింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి నిధులు తరలివెళతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అధినేత క్రిస్టిన్ లగార్డే వ్యాఖ్యలు ప్రతికూల  ప్రభావం చూపాయి. భారత్ కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగారు.

దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 37పాయింట్లు చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు 0.4 శాతం చొప్పున క్షీణించాయి.  ఎఫ్‌ఎంసీజీ, మౌలిక, టెక్నాలజీ, కొన్ని ఎంపిక చేసిన వాహన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
 
బుధవారం నాటి ముగింపు(28,736 పాయింట్లు)తో పోల్చితే బీఎస్‌ఈ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 28,767 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల వరదతో పటిష్టమైన కొనుగోళ్ల కారణంగా 28,807 పాయింట్ల గరిష్ట స్థాయికి (71 పాయింట్లు లాభం)ఎగసింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 28,547(189 పాయింట్లు నష్టం) పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 8,686 పాయింట్ల వద్ద ముగిసింది.
 
3 శాతం నష్టపోయిన ఎన్‌టీపీసీ
30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. 10 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనున్నదన్న వార్తలతో ఎన్‌టీపీసీ 3 శాతం పతనమైంది. గత నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ హోల్‌సేల్ విక్రయాలు 1 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ 2 శాతం తగ్గింది. రూపాయి బలపడడంతో ఐటీ షేర్లు పతనమయ్యాయి. 1,585 షేర్లు నష్టాల్లో, 1,262 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈలో రూ.18,204 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,32,303 కోట్లుగా నమోదైంది.  విదేశీ ఇన్వెస్టర్లు రూ.457 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.883 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సింగపూర్, దక్షిణ కొరియాలు మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
 
మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు వీలు కల్పించండి సెబీకి ఈకామర్స్ కంపెనీల వినతి పెద్ద సంఖ్యలో వస్తున్న ఈకామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు నిధుల సమీకరణ కోసం క్యాపిటల్ మార్కెట్ల బాట పట్టాలని యోచి స్తున్నాయి. ఇందుకోసం ఐపీవో నిబంధనలు సడలించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే పలువురు పరిశ్రమ ప్రముఖులు, వెంచర్ క్యాపిటలిస్టులు .. సెబీ చైర్మన్ యూకే సిన్హాను, ఇతర ఉన్నతి అధికారులను కలిశారు.
 
సెబీ ససేమిరా..!
కాగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెబీ మాత్రం ఈకామర్స్ కంపెనీల కోసం ఐపీవో నిబంధనల సడలింపుపై అంత సానుకూలంగా లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement