Sakshi News home page

మార్కెట్లకు ‘ఫెడ్‌’ డైరెక్షన్‌

Published Mon, Jul 24 2017 12:19 AM

మార్కెట్లకు ‘ఫెడ్‌’ డైరెక్షన్‌ - Sakshi

25–26 తేదీల్లో  ఫెడరల్‌ రిజర్వ్‌ భేటీ
27న డెరివేటివ్స్‌ ముగింపు
కంపెనీల ఫలితాలు,లిక్విడిటీ కీలకం
స్టాక్‌ వారీ కదలికలు, కన్సాలిడేషన్‌కు అవకాశం
ప్రతికూలతలు లేకుంటే ముందుకే
♦  విశ్లేషకుల అంచనాలు


న్యూఢిల్లీ: ఈ వారం పలు కీలక అంశాలకు వేదిక కానుంది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్‌ సమావేశం బుధవారం జరగనుండగా, జూలై నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు గురువారంతో గడువు తీరిపోనుంది. వీటితోపాటు బ్లూచిప్‌ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. అధిక వోలటాలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూచిప్‌ కంపెనీల ఫలితాలు, వచ్చే నెల ఫ్యూచర్స్‌కు రోలోవర్‌ ఏ మేర ఉంటుందన్నవి మార్కెట్‌ సెంటిమెంట్‌ను నిర్ణయించే అంశాలుగా ట్రేడ్‌స్మార్ట్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా అభిప్రాయపడ్డారు.

 బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పారు. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి, ఓఎన్‌జీసీ, హీరోమోటో కార్ప్, డాక్టర్‌ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిక్‌ బ్యాంకు, తదితర బ్లూచిప్‌ కంపెనీలు జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కీలక అంశాల నేపథ్యంలో మార్కెట్లలో అధిక అస్థిరత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్‌ క్వార్టర్‌ ఫలితాల నేపథ్యంలో మార్కెట్‌ కన్సాలిడేట్‌ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ స్ట్రాటజిస్ట్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు అంత ఆశాజనకంగా ఏమీ లేవన్నారు.  

తేడా వస్తే రివర్స్‌
‘‘అధిక లిక్విడిటీకితోడు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలతో మార్కెట్లు అధిక స్థాయికి చేరాయి. అధిక స్థాయిల దిశగా సెంటిమెంట్‌ నెలకొని ఉంది. అదే సమయంలో ఉన్నట్టుండి మార్కెట్లు తిరుగుముఖం పట్టే రిస్క్‌ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే అది మన మార్కెట్లపై పడుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీద్‌ మోదీ చెప్పారు. 25–26 నాటి ఫెడ్‌ సమావేశం నుంచి ఏవైనా ఊహించని నిర్ణయాలు వెలువడతాయా అన్న ఆసక్తి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ వారీగా కదలికలతోపాటు మార్కెట్లలో కన్సాలిడేషన్‌ ఉంటుందని అధిక శాతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వారం రిజల్ట్స్‌
సోమవారం (24న) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్, అంబుజా సిమెంట్స్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. 25న భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్‌ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీలు... ఈ నెల 26న యస్‌ బ్యాంక్, 27న డాక్టర్‌ రెడ్డీస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు, 28న ఎల్‌ అండ్‌ టీ కంపెనీలు జూన్‌ త్రైమాసికపు ఫలితాలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం జపాన్, అమెరికా తయారీ రంగాల పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 26న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుండగా, ఈ వారంలోనే చమురు ఉత్పాదక దేశాల సమాఖ్య ఓపెక్‌ సమావేశం కూడా జరగనున్నది.

జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల దూకుడు
దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) దూకుడు కొనసాగుతోంది. క్యాపిటల్‌ మార్కెట్లలో జూలైలో 2.4 బిలియన్‌డాలర్ల (రూ.15,348 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశీయులు చేసిన పెట్టుబడులు 25 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,60,000 కోట్లు) దాటేశాయి. జనవరి నెలలో రూ.3,496 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్ల పట్ల సానుకూలంగానే కొనసాగుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జూలై 3–21 తేదీల మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ.2,977 కోట్ల మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ మార్కెట్లో రూ.12,371 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Advertisement
Advertisement