వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపైనే దృష్టి | Sakshi
Sakshi News home page

వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపైనే దృష్టి

Published Thu, Feb 22 2018 12:53 AM

Focus on growth rate and inflation - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 6–7 తేదీల్లో జరిపిన కీలక పరపతి సమీక్షలో దేశంలో ప్రస్తుత వృద్ధి, ద్రవ్యోల్బణంపైనే ప్రధాన చర్చ జరిగింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనబడుతున్నా,  ఇప్పుడే ప్రారంభమైన ఆర్థిక రికవరీల నేపథ్యంలో ప్రస్తుతానికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) యథాతథంగా కొనసాగించడమే మంచిదన్న అంశానికి మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది.  ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో ఐదుగురు రేటు యథాతథ స్థితికి మద్దతు పలుకగా, ఒక్క ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ దేబబ్రత మాత్రం పావుశాతం రేటు పెంపునకు ఓటు చేశారు. పొంచిఉన్న ద్రవ్యోల్బణం సవాలును దీనికి ఆయన కారణంగా చూపారు.  రేటు యథాతథ స్థితి 6 నెలల్లో ఇది వరుసగా మూడోసారి.

వచ్చే సమావేశంలోనూ రేటు యథాతథమే?
ద్రవ్యోల్బణం పెరిగేతే... రేటు పెంపు ఖాయమన్న సంకేతాలను ఫిబ్రవరి 6–7  పాలసీ సమావేశం ఇచ్చిందనే భావించవచ్చు. అయితే  ఈ సమావేశం తరువాత, జనవరికి సంబంధించి రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు  ఫిబ్రవరి 12వ  తేదీన, టోకు ద్రవ్యోల్బణానికి సంబంధించి జనవరి గణాంకాలు  15న  వెలువడ్డాయి. టోకు ద్రవ్యోల్బణం ఈ నెలలో ఆరు నెలల కనిష్ట స్థాయిలో 2.84 శాతంగా నమోదయ్యింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ రేటు 17 నెలల గరిష్ట స్థాయిలో 5.21 శాతంగా ఉంది. ఇదే తీరున ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే, వృద్దికి ఎటువంటి విఘాతం కలగకుండా ఏప్రిల్‌ జరిగే పరపతి సమీక్షలో కూడా రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ప్లస్‌ 2, మైసస్‌ 2తో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.   

Advertisement

తప్పక చదవండి

Advertisement