టోకు, రిటైల్‌ ధరల మంట..

15 Mar, 2017 01:09 IST|Sakshi
టోకు, రిటైల్‌ ధరల మంట..

ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతం
రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం
వేగంగా  పెరిగిన నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలు  


న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత ప్రభావం ఫిబ్రవరిలో అటు టోకు ధరలు, ఇటు రిటైల్‌ ధరలు రెండింటిపై ప్రభావం చూపించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతంగా నమోదుకాగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదయ్యింది (2016 ఫిబ్రవరితో పోల్చిచూస్తే). 2017 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం రేటు 5.25%గా ఉండగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా ఉంది. సూచీలనూ వేర్వేరుగా చూస్తే...

టోకు ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్టం..
ఆహార, ఇంధన ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 2017 జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతంగా ఉంది. ఆహార ధరలు ఫిబ్రవరిలో వార్షికంగా 2.69 శాతం పెరిగితే, జనవరిలో ఈ రేటు 0.56 శాతంగా ఉంది. తృణధాన్యాలు, బియ్యం, పండ్ల ధరలు పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 8.05 శాతం పెరిగాయి.
ఇంధన ధరల బాస్కెట్‌ –7.07 శాతం క్షీణత నుంచి 21.02 శాతానికి పెరిగింది.
సూచీలో మెజారిటీ వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా క్షీణత –0.52 శాతం నుంచి 3.66 శాతానికి ఎగసింది.

రిటైల్‌ నాలుగు నెలల గరిష్టానికి...
జనవరిలో 3.17 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం, తరువాతి నెల ఫిబ్రవరిలో నాలుగు నెలల గరిష్ట స్థాయి 3.65 శాతానికి చేరింది.

రిటైల్‌గా చూస్తే– ఆహార ఉత్పత్తుల ద్రవ్యో
ల్బణం 2.01 శాతంగా నమోదయ్యింది. (జనవరిలో 0.61 శాతం) పండ్ల ధరలు భారీగా 8.33 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్‌ విభాగంలో రేటు 3.9 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరలు 3.5 శాతానికి ఎగశాయి.   చక్కెర, తీపి పదార్థాల ధరలు 18.83 శాతం పైకి లేచాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4.22 శాతం పెరిగాయి. గృహోపకరణాలు, సేవల విభాగంలో రేటు 4.09 శాతంగా ఉంది. ఆరోగ్య విభాగంలో ద్రవ్యోల్బణం 4 శాతం ఉంది.

రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ద్రవ్యోల్బణం 5.39 శాతం ఎగసింది. కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం –8.29 శాతం, –9.02 శాతం చొప్పున తగ్గాయి.దుస్తులు, పాదరక్ష విభాగంలో రేటు 4.38 శాతంగా ఉంది. హౌసింగ్‌ సెగ్మెంట్‌లో ఈ రేటు 4.9 శాతంగా ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంత రిటైల్‌ ద్రవ్యోల్బణం నెలవారీగా ఫిబ్రవరిలో 3.36 శాతం నుంచి 3.67 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 3.55 శాతానికి చేరింది.  కాగా  ధరల పెరుగుదల కారణంగా 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతంపైకి ఎగసే అవకాశం ఉందని ఇక్రా ప్రిన్షిపల్‌ ఎకనమిస్ట్‌ ఆదితి నయ్యర్‌ అభిప్రాయపడ్డారు.

రేట్లు ఇక యథాతథమే..!
బ్యాంకులకు తానిచ్చే రుణరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) ఇక తగ్గించడం కష్టమేనని గత పాలసీ సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. తాజా ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇదే విధంగా ఆర్‌బీఐ ఇకముందూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 6న ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు