వాచీలా మడిచేయగల స్మార్ట్ ఫోన్! | Sakshi
Sakshi News home page

వాచీలా మడిచేయగల స్మార్ట్ ఫోన్!

Published Wed, May 25 2016 7:59 PM

వాచీలా మడిచేయగల స్మార్ట్ ఫోన్! - Sakshi

చైనాకు చెందిన మోక్సి గ్రూప్ అనే ఓ చిన్న స్టార్టప్ కంపెనీ సెల్‌ఫోన్ల తయారీలో విప్లవాన్ని సృష్టించింది. ఏకంగా ముంజేతికి కట్టుకునే వాచీలా వంగిపోయే సెల్‌ఫోన్‌ను తయారుచేసింది. వాచీ లేదా బ్రేస్‌లెట్‌లా తమ ఫోన్‌ను చుట్టేసుకోవచ్చని, అప్పుడు కూడా అది పనిచేస్తుందని సదరు కపెంనీ చెప్పింది. అలా అయితే ఇక జేబులో ఫోన్ పెట్టుకోవడం, అది పోయిందని బాధపడటం అవసరం లేదన్నమాట. హాయిగా చేతికి కట్టుకుని, అలాగే దాంట్లో మాట్లాడేసుకోవచ్చు కూడా. ప్రపంచంలోనే అత్యంత సన్నటి, బలమైన గ్రాఫీన్ అనే పదార్థాన్ని ఉపయోగించి దీని స్క్రీన్‌ను తయారుచేశారు. ఈ పదార్థం తేలిగ్గా, పారదర్శకంగా, ఎటువైపు అయినా వంగేలా ఉంటుంది. ఇప్పటికే తాము ఈ ఫోన్ మోడల్‌ను తయారుచేశామని, ఈ ఏడాది ఆఖరుకల్లా చైనాలో లక్షఫోన్లను అమ్మకానికి పెట్టాలన్నదే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

అయితే ఇక్కడో ట్విస్టు ఉంది.. ముందుగా విడుదల చేసే ఫోన్లలో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. పూర్తిస్థాయి కలర్ ఫోన్‌ను 2018 నాటికి తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫోన్లను ఒక్కోటీ రూ. 50వేల వంతున అమ్ముతారని భావిస్తున్నారు. సులభంగా వంగేలా ఉండే టచ్‌స్క్రీన్లను తయారుచేయాలని శామ్‌సంగ్, ఎల్జీ కంపెనీలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యాపిల్ సంస్థ గత సంవత్సరం 'ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్' కోసం ఓ పేటెంటు పొందింది. ఈలోపే చైనా కంపెనీ అలాంటి ఫోన్ తయారు చేసేసింది.

Advertisement
Advertisement