Sakshi News home page

జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

Published Tue, Jun 12 2018 12:30 AM

Genius Consultants, Varroc Engineering get Sebi nod for IPO - Sakshi

న్యూఢిల్లీ: మానవ వనరుల సంస్థ, జీనియస్‌ కన్సల్టెంట్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం లభించింది. ఈ కంపెనీతో పాటు వాహన విడిభాగాలు తయారు చేసే వారోక్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. మొత్తం మీద ఈ ఏడాది సెబీ 22 కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది.

జీనియస్‌ కన్సల్టెంట్స్‌:
ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.170 కోట్ల విలువైన తాజా షేర్లను ఆఫర్‌ చేస్తోంది. వీటితో పాటు ప్రమోటర్‌ రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌ పది లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయిస్తున్నారు.

ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీల కొనుగోళ్లకు, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి, బ్రాంచ్‌ ఆఫీసుల ఏర్పాటు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, యస్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్, బాష్, పేటీఎమ్, టీసీఎస్‌ తదితర సంస్థలకు తన సర్వీసులందజేస్తోంది.

వారోక్‌ ఇంజనీరింగ్‌:
ఐపీఓలో 1.85 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓ సైజు రూ.2,500–3,000 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. సింగపూర్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, ఒమెగా టీసీ హోల్డింగ్స్‌ పీటీఈ, టాటా క్యాపిటల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ కంపెనీలు తమ వాటా షేర్లలో కొంత భాగాన్ని ఐపీఓలో భాగంగా విక్రయించనున్నాయి. 

ఈ కంపెనీ ఫోర్డ్, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్, ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్, రెనో, నిస్సాన్, మిత్సుబిషి గ్రూప్, బజాజ్‌ ఆటోలకు విడిభాగాలు సరఫరా చేస్తోంది.  

Advertisement
Advertisement