సిమెంటు కంపెనీల పల్లెబాట | Sakshi
Sakshi News home page

సిమెంటు కంపెనీల పల్లెబాట

Published Wed, Jun 17 2020 5:23 AM

Global Cement Mixer Market 2020 – Impact of COVID-19 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 దేశవ్యాప్తంగా అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. ఇందులో సిమెంటు రంగం కూడా ఒకటి. కార్మికులు లేక నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో సిమెంటుకు డిమాండ్‌ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతుండడం కంపెనీలకు కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు కంపెనీలు గ్రామాలపై దృష్టిపెట్టాయి. అయితే కార్మికులు తిరిగి వస్తేనే నిర్మాణ రంగం గాడిన పడుతుందన్నది కంపెనీల మాట. జనవరి–మార్చి నాటికి మార్కెట్‌ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది.

గ్రామీణ ప్రాంతాలే ఆధారం...
ప్రస్తుతం జరుగుతున్న సిమెంటు వినియోగంలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచే జరుగుతోందని భారతి సిమెంట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎం.రవీందర్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లో నిర్మాణాలు చాలా మందకొడిగా సాగుతున్నాయని చెప్పారు. ఊహించినదానికంటే అధికంగా పట్టణేతర ప్రాంతాల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. నిర్మాణ రంగంలో ఇప్పుడు 30% మాత్రమే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.  కార్మికులు తిరిగి వస్తేనే సిమెంటుకు మంచి రోజులని వ్యాఖ్యానించారు. ప్లాంట్లలో తయారీ 25–30 శాతానికి పడిపోయిందన్నారు. ఇది జూలై–సెప్టెంబరులో 40–50%కి చేరుతుందన్న విశ్వాసం ఉందని చెప్పారు. కార్మికుల ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక రంగ ప్రాజెక్టులపై పెట్టుబడులు చేస్తుందని తాము భావిస్తున్నామని సాగర్‌ సిమెంట్స్‌ జేఎండీ శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి–మార్చికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

పదేళ్లుగా ధర అక్కడే..: తెలుగు రాష్ట్రాల్లో పదేళ్లుగా సిమెంటు బస్తా ధర రూ.350 చుట్టూ తిరుగుతోందని రవీందర్‌ రెడ్డి అన్నారు. ‘ద్రవ్యోల్బణం ప్రకారం చూసుకున్నా ఆ స్థాయిలో ధర పెరగలేదు. ప్లాంట్లలో ఉత్పత్తి 60–65 శాతమైతే బస్తా ధర రూ.350 ఉన్నా సరిపోతుంది. తయారీ 10% తగ్గితే బస్తాపైన వ్యయం రూ.25–30 అధికం అవుతుంది. ఇప్పుడు ప్లాంట్ల సామర్థ్యం 25–30%కి పరిమితమైంది. ఉత్పత్తి లేకున్నా  సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ కంపెనీలకు భారమే. గతేడాది సగటుతో పోలిస్తే ధర 1% మాత్రమే పెరిగింది. జీఎస్టీ 28 శాతం ఉంది. దీనిని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం’ అని వివరించారు. ఇక రవాణా సమస్యలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు సిమెంటు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో  ఈ రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరాపై కంపెనీలు దృష్టిపెట్టాయి. కరోనా నియంత్రణలోకి వస్తేనే రవాణా సమస్యల నుంచి గట్టెక్కుతామనేది కంపెనీల మాట.

సిమెంటు అమ్మకాలు ఇలా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జనవరిలో 23 లక్షల టన్నులు, ఫిబ్రవరిలో 17, మార్చిలో 14 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. కోవిడ్‌–లాక్‌డౌన్‌ ప్రభావంతో ఏప్రిల్‌లో ఇది 3.65 లక్షల టన్నులకు దిగొచ్చింది. అమ్మకాల పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇదే తక్కువ పరిమాణం. మే నెలలో ఇరు రాష్ట్రాలు చెరి 7 లక్షల టన్నుల విక్రయాలు సాధించాయి. ఇందులో ఒక లక్ష టన్నుల మేర ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్డర్లే ఉంటాయి. ఇక 2019 మే నెలలో 22 లక్షల టన్నులు కాగా, అదే ఏడాది జనవరిలో అత్యధికంగా 31 లక్షల టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. గత నెలతో పోలిస్తే జూన్‌ అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ భావిస్తోంది.

 

Advertisement
Advertisement