భారత్‌పై గ్లోబల్ ఎక్స్ఛేంజీల కన్ను! | Sakshi
Sakshi News home page

భారత్‌పై గ్లోబల్ ఎక్స్ఛేంజీల కన్ను!

Published Sat, Feb 22 2014 1:03 AM

భారత్‌పై గ్లోబల్ ఎక్స్ఛేంజీల కన్ను!

 ముంబై: విదేశీ నిధుల సమీకరణ అవకాశాలు, సరళతరమైన లిస్టింగ్ నిబంధనలు వంటి అంశాల ద్వారా అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు దేశీ కంపెనీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గ్లోబల్ ఎక్స్ఛేంజీల ఉన్నతాధికారులు గత రెండు నెలలుగా ఇండియాలో చర్చలు నిర్వహిస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ, స్విస్ స్టాక్ ఎక్స్ఛేంజీ సిక్స్ తదితర ఎక్స్ఛేంజీల అధికారులు వివిధ కంపెనీ అధినేతలతో ఈ అంశంపై చర్చలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ను చేపట్టేందుకు వీలుగా గత నెలలో స్విస్ ఎక్స్ఛేంజీ కొన్ని కంపెనీలతో చర్చలు నిర్వహించింది. ఇందుకు అనుగుణంగా డిపాజిటరీ సెక్యూరిటీల లిస్టింగ్ ద్వారా లిక్విడిటీ సైతం లభిస్తుందని స్విస్ ఎక్స్ఛేంజీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మార్కో ఈస్టర్‌మన్ చెప్పారు. ఈ విషయంలో లిస్టింగ్ నిబంధనలకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాల కోసం దేశీ కంపెనీలు ఎదురు చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిక్స్ అనేది యూరప్‌లోనే మూడో పెద్ద ఎక్స్ఛేంజీ. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ హవా, అత్యధిక స్థాయి పెన్షన్ నిధులు వంటి అంశాలతో స్విట్టర్లాండ్ భారీ పెట్టుబడులకు అవకాశాన్ని కల్పిస్తుండటం విశేషం!

  1,020 కంపెనీలతో...
 అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ చేపట్టాలని పలు కంపెనీలు యోచిస్తున్నాయని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీ గ్రూప్ ఈక్విటీ ప్రైమరీ మార్కెట్స్ హెడ్ అలస్టర్ వామ్‌స్లే పేర్కొన్నారు. నిధుల సమీకరణ, విదేశీ లిస్టింగ్ వంటి అంశాలపై సుమారు 1,020 కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జీడీఆర్, ఏడీఆర్‌ల జారీ నిబంధనలు, విదేశీ లిస్టింగ్ అంశాలపై సాహూ కమిటీ సలహాలు దేశీ కార్పొరేట్ రంగానికి మేలు చేకూర్చగలవని భావిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక శాతం కంపెనీలు విదేశీ నిధుల సమీకరణపట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయని చెప్పారు. ఎఫ్‌సీసీబీ, జీడీఆర్ నిబంధనల హేతుబద్ధీకరణకు ఏర్పాటైన ఎంఎస్ సాహూ కమిటీ సరళ నిబంధనలను సూచిం చింది. కాగా, ఇటీవల అన్‌లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీలు కూడా విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్ట్‌కావడం ద్వారా నిధులను సమీకరిం చేందుకు వీలు కల్పించిన సంగతి తెలిసిందే.  
 
 సాహూ కమిటీ సలహాలు
 
 జీడీఆర్, ఎఫ్‌సీసీబీ జారీ నిబంధనలను పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం సాహూ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఆమోదముద్ర పొందిన కంపెనీల బిల్లు, తదితర చట్టాలకు అనుగుణంగా వీటి నిబంధనలను క్రమబద్ధీకరిస్తూ సూచనలు చేసింది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల ఆర్థిక శాఖ అన్‌లిస్టెడ్ కంపెనీల విదేశీ లిస్టింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కాకుండానే నేరుగా విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యేందుకు అన్‌లిస్టెడ్ కంపెనీలకు మార్గం సుగమమైంది.

దేశీయంగా ఆర్థిక మందగమనం కొనసాగడం, స్టాక్ మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించడం వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వం విదేశీ నిధుల సమీకరణ అవకాశాలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది. దీనిలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను నవీకరించడంతోపాటు, మనీ లాండరింగ్‌ను నిరోధించే చట్టాలను పటిష్ట పరిచే చర్యలను చేపట్టింది. తద్వారా దేశీ కంపెనీలు ఎఫ్‌సీసీబీలు, జీడీఆర్‌ల జారీ ద్వారా విదేశీ నిధులను సమీకరించే అవకాశాలను పెంచడంతోపాటు, అంతర్జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ అవకాశాలను మెరుగుపరచనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement