జీఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నేపాల్ ఓకే.. | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నేపాల్ ఓకే..

Published Tue, Sep 23 2014 12:23 AM

జీఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నేపాల్ ఓకే.. - Sakshi

రూ.9,000 కోట్ల వ్యయం
- నేపాల్‌లో అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే
- విదేశాల్లో జీఎంఆర్‌కు ఇది భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్‌నకు పెద్ద ఊరట. ఆరేళ్లుగా అనుమతికి నోచని భారీ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నేపాల్‌లో 900 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్టును బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన జీఎంఆర్ 2008లో అంతర్జాతీయ పోటీ వేలంలో దక్కించుకుంది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు సైతం తమ దేశానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలగాలని పట్టుబడుతూ వచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు నేపాల్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్‌తోపాటు నేపాల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19న జీఎంఆర్‌తో ప్రాజెక్టు అభివృద్ధి ఒప్పందం(పీడీఏ) కుదిరింది. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, భారత హోం  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
 
భారీ ఎఫ్‌డీఐ..: కర్నాలి నదిపై నిర్మించనున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు. నేపాల్‌లోకి రానున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే భారీది. ప్రాజెక్టులో 27 శాతం ఉచిత వాటా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి జీఎంఆర్ ఇస్తుంది. కన్సెషన్ పీరియడ్ 25 ఏళ్లు. అంటే 25 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు యాజమాన్య హక్కులు నేపాల్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. తాజా ఒప్పందం ప్రభావంతో తమ దేశానికి మరిన్ని ఎఫ్‌డీఐలు కార్యరూపం దాలుస్తాయని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో 2 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని జీఎంఆర్ ప్రత్యేకంగా నెలకొల్పనుంది.
 
భారత్ వెలుపల..
జీఎంఆర్ గ్రూప్‌నకు భారత్ వెలుపల అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 2016 సెప్టెంబర్ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రాజెక్టులో వాణిజ్య ఉత్పత్తి సెప్టెంబరు 2021 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఏటా 3,500 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 12 శాతం నేపాల్‌కు ఉచితంగా ఇవ్వనున్నారు. మిగిలినది భారత్‌కు సరఫరా చేస్తారు. విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement
Advertisement