స్మార్ట్‌ఫోన్లో మూడో నేత్రం.. | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్లో మూడో నేత్రం..

Published Wed, Aug 30 2017 2:25 AM

స్మార్ట్‌ఫోన్లో మూడో నేత్రం.. - Sakshi

♦  జీరో మెయింటెనెన్స్‌తో గోద్రెజ్‌ ‘ఈవ్‌’  
సీసీటీవీల ధర రూ.5,500–9,900


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నగరాలతోపాటు పట్టణాల్లోనూ సీసీటీవీల (కెమెరా) వాడకం ఇప్పుడు బాగా పెరుగుతోంది. సమస్యల్లా వీటి నిర్వహణ ఖర్చులే. పైగా వీడియో రికార్డింగ్‌ పెద్ద ప్రహసనం కూడానూ. అయితే ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా కెమెరాలను సులభంగా నిర్వహించుకోవచ్చని చెబుతోంది గోద్రెజ్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌.

 ప్రపంచంలో ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ప్రత్యక్షంగా వీడియోను వీక్షించే సీసీటీవీలను ఈవ్‌ పేరుతో సెప్టెంబర్‌ 1న విడుదల చేస్తోంది. ఆయస్కాంతం (మ్యాగ్నెట్‌) ఉన్న ఈ సీసీటీవీలను ఎక్క డైనా ఏర్పాటు చేయవచ్చు. వైఫైతో అనుసంధానిస్తే చాలు. వీడియో అంతా క్లౌడ్‌లో స్టోర్‌ అవుతుంది. కెమెరాకు మెమరీ కార్డు పెట్టుకునే వెసులుబాటూ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ ద్వారా కెమెరా యాంగిల్‌ను మార్చుకోవచ్చు. కావల్సిన తేదీ, సమయంలో రికార్డయిన వీడియోను క్షణాల్లో చూడొచ్చు. కరంటు సప్లై లేనప్పుడు పవర్‌ బ్యాంక్‌తోనూ పనిచేస్తాయి.  

భారత్‌లో తొలిసారి..
తక్కువ ధరతోపాటు ఇన్ని ఫీచర్లతో సీసీటీవీలను తీసుకు రావడం భారత్‌లో తొలిసారి అని గోద్రెజ్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌ మెహర్నోష్‌ పిథ్థావాలా తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక సేల్స్‌ డీజీఎం శరత్‌ మోహన్‌తో కలసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈవ్‌ సిరీస్‌లో రూ.5,500–9,900 ధరలో మూడు మోడళ్లను ప్రవేశపెడుతున్నాం. అదనపు ఖర్చులేవీ లేవు. మెయింటెనెన్స్‌ అక్కరలేదు. ఒక కెమెరా ఇచ్చే వీడియోను యాప్‌ సాయంతో కుటుంబ సభ్యులందరూ తమ స్మార్ట్‌ఫోన్లలో లైవ్‌ చూడొచ్చు. క్లౌడ్‌ స్టోరేజీ ఉచితం. కెమెరాకు ఉన్న సెన్సార్లు కదిలే వస్తువును ఇట్టే గుర్తిస్తాయి. రాత్రిపూట సైతం చక్కగా పనిచేస్తాయి. సెన్సార్లు స్పందించడమేగాక అలర్టుల రూపంలో నిమిషం నిడివిగల వీడియోలను పంపిస్తాయి. కెమెరాలకు ఏడాది వారెంటీ ఉంది’ అని తెలిపారు.

Advertisement
Advertisement