Sakshi News home page

అక్షయ తృతీయనాడు 30 వేల దిగువకు పసిడి

Published Mon, May 9 2016 3:57 PM

అక్షయ తృతీయనాడు  30 వేల దిగువకు పసిడి

న్యూఢిల్లీ:  అక్షయ తృతీయ  సెంటిమెంట్ వ్యాపారులకు నిరాశ మిగిల్చింది.  డిమాండ్ బాగా పెరిగిందని  ఆన్ లైన్ వ్యాపారులు  ఒకవైపు ప్రకటించగా,  బంగారు ఆభరణాల దుకాణాలు మాత్రం అక్షయ తృతీయ రోజు పసిడి అమ్మకాలు ఆశించినంతగా లేక  వెలవెల బోయాయి.   పవిత్రమైన  అక్షయ తృతీయ  రోజు  అంచనాలకు అనుగుణంగా  వ్యాపారం జరగలేదు. కొనుగోలుదారులనుంచి  స్పందన పెద్దగా లేకపోవడంతో  బులియన్ మార్కెట్  చిన్నబోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో  విలువైన మెటల్  మార్కెట్ లో మెరుపులు మాయమయ్యాయి.   ఒక దశలో పసిడి   250 రూ.ల నష్టపోయి 10గ్రా. ధర 30,100 దగ్గర స్థిరంగా ట్రేడయిన పసిడి ధరలు ఆతర్వాత  30 వేల మార్క్  దిగువకు పడిపోయాయి. 389 రూపాయలను  కోల్పోయి 29, 989 స్థాయిని నమోదు చేసింది.   బలహీన అమెరికా  పే రోల్ నివేదిక అనంతరం డాలర్ విలువ   పుంజుకుంది.  దీంతోపాటు విదేశీ మార్కెట్లలో బలహీన ధోరణి బంగారం ధరలు పతనానికి దారితీసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.  పెళ్ళిళ్ళ సీజన్  లేకపోవడం, ఈ మధ్య కాలంలో ధరలు పెరగడం కారణంగా  పవిత్రమైన అక్షయ తృతీయ సెంటిమెంట్ పనిచేయలేదని  పేర్కొన్నారు.  ప్రస్తుతం బలహీనంగా ఉన్నప్పటికీ,  కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని  ఢిల్లీ కి చెందిన వ్యాపారి గౌరవ్ ఆనంద్   తెలిపారు.   వివాహాది శుభకార్యాలు ముగియడం, ప్రస్తుతం మూఢం నడుస్తున్నందున, భారీ కొనుగోళ్లు ఆశించలేమని వ్యాపారులు  అభిప్రాయం వ్యక్తం చేశారు.


అటు పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులనుండి డిమాండ్ తగ్గడంతో  వెండి కూడా బలహీనంగానే ట్రేడ్ అవుతోంది. దాదాపు కిలో  రూ 350 క్షీణతతో  రూ 41.200  దగ్గర ఉంది.  గ్లోబల్ గా  పసిడి ధరలను ప్రభావితం చేసే సింగపూర్  మార్కెట్ లో బంగారం 0.7 శాతం, వెండి అరశాతం మేర ధరలు పడిపోయాయి.  ఇది దేశరాజధాని నగరంలోని  బులియన్  మార్కెట్ ను కూడా ప్రభావితం చేసింది.అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి.

Advertisement

What’s your opinion

Advertisement