పసిడి ధర పెరుగుదల తాత్కాలికమే!

7 Dec, 2015 03:39 IST|Sakshi
పసిడి ధర పెరుగుదల తాత్కాలికమే!

* అంతర్జాతీయ మార్కెట్‌పై నిపుణులు
న్యూయార్క్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు పెంచడం దాదాపు ఖాయం కావడం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ డిపాజిట్ రేటు తగ్గించడం వంటి ప్రతికూల వార్తల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగతో తాజాగా పసిడి ధర కొంత బలపడింది. అయితే ఇది తాత్కాలిక ధోరణేనని ఫ్రాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బులియన్ బ్యాంక్ కటిక్సిస్ పేర్కొంది.  ఫెడ్ ఫండ్ రేటు పెరిగిన తర్వాత ధర మళ్లీ క్రమేపీ క్షీణించవచ్చని బ్యాంక్ అంచనావేస్తోంది.

ఫెడ్ రేటు పెంపు తర్వాత ఔన్స్ (31.1గా) ధర వెయ్యి డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని సంస్థ 2016 అవుట్‌లుక్ పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగితే గోల్డ్ హోల్డింగ్స్ వ్యయాలు పెరిగిపోయే ప్రమాదమే దీనికి కారణమని విశ్లేషించింది. క్రమీణా 950 డాలర్లకు పడిపోయే వీలుందని బ్యాంక్ విలువైన లోహాల విశ్లేషకుడు బెర్నాండ్ దహ్బాద్ పేర్కొన్నారు. 2016లో సగటు ధర 970 డాలర్లుగా ఉంటుందని అంచనా.
 
ఏడవ వారమూ డౌన్...
ఇక వారంవారీగా.. వరుసగా ఏడవ వారమూ నష్టాన్నే చవిచూశాయి. వారం వారీగా 4వ తేదీ శుక్రవారం రూ. 145 నష్టంతో రూ.25,140 వద్ద ముగిసింది.  99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం తగ్గి, రూ. రూ.25,290 వద్ద ముగిసింది. ముంబై మార్కెట్‌లో శనివారం ధర లభ్యం కాకున్నా... ఢిల్లీసహా పలు బులియన్ మార్కెట్లలో శనివారం పసిడి ధరలు భారీగా పెరిగాయి.

ఈ జోరు సోమవారం ముంబైలో కనిపించే వీలుంది.  అంతర్జాతీయంగా న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ డెలివరీ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం వారం ముగింపు 1,056 డాలర్లతో పోల్చితే 28 డాలర్ల లాభంతో 1,084 డాలర్ల వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు