వరుసగా మూడో వారమూ పసిడి పరుగు | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో వారమూ పసిడి పరుగు

Published Mon, Jul 31 2017 12:21 AM

వరుసగా మూడో వారమూ పసిడి పరుగు - Sakshi

కొనసాగిన డాలర్‌ బలహీనత  
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారం జరిగిన తన పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్‌ ఫండ్‌ రేటును పెంచకపోవడంతో (ప్రస్తుతం 1–1.25 శాతం) పసిడిలోకి ఇన్వెస్టర్ల పెట్టుబడులు వరుసగా మూడవ వారమూ కొనసాగాయి. అమెరికాలో వృద్ధి వేగం ఊహించినంతగా లేదన్నది దీనికి నేపథ్యం. 28వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌–  నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1 గ్రా.) ధర 14 డాలర్లు ఎగసి, 1,269 డాలర్లకు చేరింది.

 గడచిన మూడు వారాల్లో ఇక్కడ పసిడి దాదాపు 64 డాలర్లు పెరిగింది. ఇదే వారంలో డాలర్‌ ఇండెక్స్‌ తన పతనాన్ని కొనసాగిస్తూ, మరో 0.60 పాయిం ట్లు తగ్గి 93.20కి చేరింది.  డాలర్‌ బలోపేతం కావటం, ఫెడ్‌ రేటు పెంచుతుందన్న అంచనాలతో మూడు  వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్‌ (31.1 గ్రా.) ధర... అమెరికాలోని తాజా రాజకీయ, ఆర్థిక ప్రతికూల వార్తలతో తిరిగి భారీగా పైకి లేచింది. ఈ వారంలో ఒకదశలో కీలక మద్దతు 1,240ని తాకిన పసిడి, అటు తర్వాత ఒక దశలో 1,272ను సైతం తాకింది.

దేశంలో పరుగుకు రూపాయి బ్రేకులు...
అంతర్జాతీయంగా పసిడి దూకుడు ప్రదర్శించినప్పటికీ, ఆ స్థాయిలో దేశంలో బంగారం పెరగలేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 30 పైసలు బలపడి 64.13కు చేరింది. దీనితో దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి వారంలో కేవలం రూ.41 పెరిగి రూ.28,580కి చేరింది. ఇక ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.95 ఎగసి రూ.28,590కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,440కు ఎగసింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.170 ఎగసి రూ.37,975కు చేరింది.

Advertisement
Advertisement