భారత్‌లో గూగుల్‌ ‘తేజ్‌’!! | Sakshi
Sakshi News home page

భారత్‌లో గూగుల్‌ ‘తేజ్‌’!!

Published Fri, Sep 15 2017 12:18 AM

భారత్‌లో గూగుల్‌ ‘తేజ్‌’!! - Sakshi

వచ్చే వారం చెల్లింపుల సేవల ఆవిష్కరణ
న్యూఢిల్లీ:
టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత మార్కెట్‌ కోసం డిజిటల్‌ పేమెంట్స్‌ సర్వీసు అందుబాటులోకి తేనుంది. కంపెనీ వచ్చే వారం దీన్ని ఆవిష్కరించవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ‘భారత మార్కెట్‌ కోసం తీర్చిదిద్దిన కొత్త ఉత్పత్తి ఆవిష్కరణ వివరాలు వెల్లడించేందుకు సెప్టెంబర్‌ 18న ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి హాజరు కావాలని‘ అంటూ గూగుల్‌ ఆహ్వాన పత్రికలు పంపినట్లు పేర్కొన్నాయి. గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్స్‌ విభాగం) సీజర్‌ సేన్‌గుప్తా కూడా దీనికి హాజరు కానున్నారు. ’గూగుల్‌ తేజ్‌ (వేగం)’ పేరుతో పేమెంట్‌ సర్వీసు ప్రారంభించవచ్చని, ఇందులోనే  ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)తో పాటు పేటీఎం, మొబిక్విక్‌ వంటి మొబైల్‌ వాలెట్స్‌కి కూడా చోటు కల్పించవచ్చని సమాచారం.

గూగుల్‌ తమ యూపీఐ పేమెంట్‌ సర్వీసును ప్రయోగాత్మకంగా పరీక్షించ డం పూర్తయిందని, రిజర్వ్‌ బ్యాంకు అనుమతుల కోసం ఎదురుచూస్తోందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఈ ఏడాది జూలైలో వెల్లడించిన సంగతి తెలిసిందే. యూపీఐ ఆధారిత పేమెంట్‌ సేవలను తాము కూడా అందించేందకు టెక్‌ దిగ్గజాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌ కూడా ఎన్‌పీసీఐతో చర్చలు జరుపుతున్నాయి. బ్యాంక్‌ అకౌంటు నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మొదలైన వాటి అవసరం లేకుండా డిజిటల్‌ చిరునామా ఆధారంగా ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసేందుకు యూపీఐ విధానం ఉపయోగపడుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement