ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా | Sakshi
Sakshi News home page

ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా

Published Fri, Aug 19 2016 1:35 AM

ఆర్ఐఎల్కు మరో రూ.2,500 కోట్ల జరిమానా - Sakshi

కేజీ డీ6లో లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్ ఉత్పత్తి
ఐదేళ్లలో విధించిన జరిమానా రూ.18,492 కోట్లు
కేంద్రంతో చర్చిస్తున్నామన్న ఆర్‌ఐఎల్

న్యూఢిల్లీ: పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యానికన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు)  చేరుకుంది.

నిజానికి ఒప్పందం ప్రకారం గ్యాస్ విక్రయంపై వచ్చిన లాభాలను ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం, నికో రిసోర్సెస్‌లు కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలి. అయితే, గ్యాస్ వెలికితీత కోసం చేసిన మూల ధన, నిర్వహణ వ్యయాలను గ్యాస్ విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలోంచి మినహాయించుకున్నాకే మిగిలిన లాభాలను పంచుకునేలా ఒప్పందం వీలు కల్పిస్తోంది. ఇప్పుడు జరిమానా వసూలు కోసం కేంద్రం ఈ ఉత్పత్తి వ్యయాలను మినహాయించుకోనివ్వకుండా ఆ మేరకు అధికంగా లాభాల్ని అందుకోనుంది.

 ఏటేటా పడిపోయిన ఉత్పత్తి
కేజీ డీ6 బ్లాక్‌లో ధీరూభాయి-1, 3 గ్యాస్ క్షేత్రాల నుంచి ప్రతి రోజు 80 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ 2011-12లో జరిగిన వాస్తవ ఉత్పత్తి రోజుకు 35.33 ఎంఎంఎస్‌సీఎండీగానే ఉంది. 2012-13లో 20.88 ఎంఎంఎస్‌సీఎండీ, 2013-14లో 9.77 ఎంఎంఎస్‌సీఎండీల మేరకే ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ ఇది 8 ఎంఎంఎస్‌సీఎండీలకే పరిమితం అయింది. అయితే, 2015-16లోనూ ఉత్పత్తి లక్ష్యానికంటే తక్కువగానే ఉన్నా, దీనికి సంబంధించిన వ్యయాల వసూలు నిలిపివేత నోటీసు రిలయన్స్‌కు ఇంకా జారీ కాలేదు.

 చర్చల దశలో ఉంది: ఆర్‌ఐఎల్
వ్యయాల రికవరీ నిలిపివేత అంశం ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని ఆర్‌ఐఎల్ స్పష్టం చేసింది. ‘‘కేంద్రం నుంచి జూన్3న అందుకున్న సవరించిన క్లెయిమ్ ప్రకారం 2014-15 సంవత్సరం వరకు 2.75 బిలియన్ డాలర్ల మేర వ్యయాల వసూల్ని నిలిపేశారు. దీనివల్ల పెట్రోలియంపై కేంద్రానికి అదనంగా వెళ్లే లాభం 24.6 కోట్ల డాలర్లు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఉత్పత్తి పంపిణీ ఒప్పందానికి తన సొంత నిర్వచనమిస్తూ అంచనాల మేరకు ప్రతిపాదిత వ్యయాల మినహాయింపును ఏటా సవరిస్తుంటుంది. వాటిని అంతకుముందు సంవత్సరాలకు కలుపుతుంది. ఈ మేరకు అదనపు లాభం కోసం డిమాండ్ చేస్తుంది. వీటితో కాంట్రాక్ట్ సంస్థ అంగీకరించదు. గ్యాస్ పూల్ ఖాతా నుంచి ఇప్పటికే కేంద్రం 8.17 కోట్ల డాలర్లు వసూలు చేసుకుంది’ అని రిలయన్స్ స్టాక్స్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.

Advertisement
Advertisement