తయారీ, ఎగుమతి కేంద్రంగా భారత్‌

7 May, 2020 06:21 IST|Sakshi

ఇందుకు కీలక రంగాల్లో సంస్కరణలు

ఆ దిశగా ప్యాకేజీ తయారీపై కసరత్తు

అమితాబ్‌ కాంత్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: కీలకమైన రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భారత్‌ను అంతర్జాతీయ తయారీ, ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు’ అనే అంశంపై ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించిన ఆన్‌లైన్‌ సెషన్‌లో ఆయన మాట్లాడారు. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మొబిలిటీ, జీనోమిక్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, 5జీ, ఫిన్‌టెక్, తయారీ అన్నవి ప్రాధాన్య క్రమంలో వేగంగా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసే రంగాలుగా పేర్కొన్నారు.

తయారీ రంగం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనదని, చైనాలో సరఫరా పరంగా ఏర్పడిన ఇబ్బందులను అనుకూలంగా మలుచుకోవాలని భారత్‌ కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 1,450 కంపెనీలను ప్రభుత్వం సంప్రదించిందని, భారత్‌లో వేగంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు, ఇక్కడికి తరలివచ్చేందుకు వీలుగా వాటికి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘భారత్‌ టెక్నాలజీని విదేశాల నుంచి అరువు తెచ్చు కోవాలి. చోరీ చేయాలి. చైనా ఇదే పని చేసింది. అందుకే తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయగలుగుతోంది’’ అని అమితాబ్‌ కాంత్‌ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు