3 రోజుల్లో 766 పాయింట్లు డౌన్ | Sakshi
Sakshi News home page

3 రోజుల్లో 766 పాయింట్లు డౌన్

Published Wed, Dec 10 2014 1:18 AM

3 రోజుల్లో 766 పాయింట్లు డౌన్ - Sakshi

తాజాగా 322 పాయింట్లు పతనం
28,000 దిగువకు చేరిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల నష్టాల ఎఫెక్ట్
అన్ని రంగాలూ తిరోగమనంలోనే


ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో పాటు చైనా స్టాక్ మార్కెట్ హఠాత్తుగా 5.5% పతనం కావడంతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. రెండో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు పెరగడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరచింది. వెరసి సెన్సెక్స్ 322 పాయింట్లు పతనమై 28,000 పాయింట్ల దిగువకు చేరింది. 27,797 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 766 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 98 పాయింట్లు జారి 8,341 వద్ద నిలిచింది.

యూరప్ బలహీనం
ఆసియా మార్కెట్ల బలహీనతకుతోడు యూరోపియన్ ఇండెక్స్‌లు కూడా 1%పైబడ్డ నష్టాలకు లోనయ్యాయి. ఇందుకు వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ జర్మనీ ఎగుమతులు క్షీణించడం ప్రభావం చూపింది. మరోవైపు నవంబర్ నెలకు యూకేలో పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా 0.1%కు పడిపోయింది. దీంతో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఇండెక్స్‌లు 1%పైగా నష్టాలతో కదులుతున్నాయి.

ఐదేళ్ల కనిష్టానికి చమురు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ చమురు మళ్లీ ఐదేళ్ల కనిష్టానికి జారింది. బ్యారల్ ధర 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఆయిల్ ధరల పతనం దేశీ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశమే అయినప్పటికీ, డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు అడ్డుపడుతున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో ట్రేడింగ్ గడిచేకొద్దీ దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బీఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 2,045 నష్టపోగా, కేవలం 997 లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% తిరోగమించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో కేవలం నాలుగు మాత్రమే నిలదొక్కుకున్నాయి.
 
చైనా ప్రధాన స్టాక్ ఇండెక్స్ షాంఘై 5.5% పతనమైంది. 2009 తరువాత ఈ స్థాయిలో దిగజారడం తొలిసారికాగా, ఇందుకు పలు అంశాలు కారణమయ్యాయి. స్వల్పకాలిక ఫైనాన్సింగ్‌కు తక్కువ స్థాయి రేటింగ్ బాండ్లను అనుమతించేదిలేదంటూ చైనా సెక్యూరిటీస్ క్లియరింగ్ హౌస్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ క్షీణించింది. దీంతో లిక్విడిటీకి అడ్డుకట్ట పడనుంది. దీనికితోడు 2015లో ఆర్థిక వ్యవస్థ 7%వృద్ధిని  మించకపోవచ్చునంటూ ప్రభుత్వం పేర్కొనడం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేసింది.

ప్రభుత్వం తొలుత 7.5% వృద్ధిని అంచనా వేయడం గమనార్హం. పైగా గత నెలరోజుల్లో చైనా షాంఘై సూచి 25 శాతం పెరగడంతో పాటు మూడేళ్ల తర్వాత తొలిసారిగా 3,000 పాయింట్ల స్థాయిని సూచి అధిగమించింది. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణ జరగడం కూడా తాజా పతనానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో  జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేసియా సైతం 0.5% స్థాయిలో నీరసించాయి.

Advertisement
Advertisement