బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం | Sakshi
Sakshi News home page

బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం

Published Sat, Dec 27 2014 12:17 AM

బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది. ఈ రెండు రంగాల్లో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు మంగళవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి నోచుకోని నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్సుల మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది.

అందుకు అనుగుణంగా బీమా బిల్లుపై ఒకటి, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కొత్తగా మరొకటి ఆర్డినెన్సులు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజాగా వీటికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.  బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడం వల్ల ఈ రంగంలో 6-8 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగ లవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందనేందుకు తాజా ఆర్డినెన్సులు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, పార్లమెంటులోని ఏదో ఒక సభలో కీలకాంశాలను అడ్డుకుంటూపోతే.. సుదీర్ఘకాలం నిరీక్షిస్తూ కూర్చునే పరిస్థితి ఉండబోదని ఇటు ఇతర దేశాలకు, అటు ఇన్వెస్టర్లకూ తెలియజేసినట్లయిందన్నారు.

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతం దాకా పెంచాలన్న ప్రతిపాదన 2008 నుంచి పెండింగ్‌లో ఉంది. రాజ్యసభ కమిటీ ఆమోదముద్ర పడినప్పటికీ మతమార్పిళ్లు మొదలైన ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగినందు వల్ల ఇటీవలే ముగిసిన సమావేశాల్లో కూడా బీమా బిల్లుపై చర్చ సాధ్యపడలేదు. అటు, లోక్‌సభ ఆమోదించినప్పటికీ బొగ్గు గనులు బిల్లుకు కూడా మోక్షం లభించలేదు.

Advertisement
Advertisement