జీఎస్‌టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి.. | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..

Published Mon, Jul 6 2015 2:01 AM

జీఎస్‌టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..

వృద్ధి, పెట్టుబడుల జోరుకు ఈ చట్టాలు తప్పనిసరి...

{పతిపక్షాలకు ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి
 
 న్యూఢిల్లీ : పెండింగులో ఉన్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), భూసేకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు మద్దతివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వృద్ధి, పెట్టుబడులకు ఊతమివ్వడంతోపాటు భారీగా ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు ఈ రెండు చట్టాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ స్కామ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ స్కామ్‌తో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల(సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే)కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13 వరకూ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, జీఎస్‌టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉండగా.. భూసేకరణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే రెండు కమిటీలూ తమ నివేదికను అందించే అవకాశం ఉంది.

 సామాజిక సర్వేపై...
 గ్రామీణ భారతావనిలో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ తాజా సర్వేలో వెల్లడైన అంశాలపై జైట్లీ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటును 8-10 శాతానికి పెంచడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.  జీఎస్‌టీద్వారా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించడం, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, పెట్టుబడులకు మెరుగైన వాతావరణం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. పేదలు, సామాజిక పథకాలపై ఆధారపడుతున్నవారికి చేదోడుగా నిలవాలంటే వృద్ధిరేటు పెంపు, ఆర్థిక సంస్కరణలే శరణ్యమన్నారు.
 
 బ్రిక్స్ బ్యాంక్ తొలి సమావేశానికి జైట్లీ...
 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతున్నారు. బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్) పాలక మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళవారంనాడు బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఆర్థిక మంత్రుల సమావేశానికి కూడా జైట్లీ హాజరవుతారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైట్లీ కూడా పాల్గొంటారు. బ్రిక్స్ బ్యాంకుకు ప్రారంభ నిధులను సమకూర్చే అంశంపై సదస్సులో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ బ్యాంకుకు తొలి సారథిగా భారతీయుడైన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement