జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్

Published Mon, Jun 19 2017 4:39 PM

జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్

న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. దాదాపు అన్ని ప్రక్రియలను పూర్తిచేసేసింది. ప్రస్తుతం జీఎస్టీని ప్రమోట్ చేయడం కోసం ఓ బ్రాండ్ అంబాసిడర్ ను కూడా నియమించింది. ఆయనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ను జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కస్టమ్స్ నియమించినట్టు తెలిసింది. ఇప్పటికే 40 సెకన్ల వీడియో ఫీచరింగ్ ను షూట్ చేశారని, దాన్ని సర్క్యూలేట్ కూడా చేస్తున్నట్టు వెల్లడవుతోంది. '' ఏకీకృత జాతీయ మార్కెట్ ను ఏర్పాటుచేయడానికి జీఎస్టీ ఓ అద్భుత కార్యక్రమం'' అని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. వీడియోకు అటాచ్డ్ గా ఈ ట్వీట్ చేసింది. జాతీయ జెండాకు సంబంధించి మూడు రంగులను ఎలాగైతే వివరిస్తామో అచ్చం అదే మాదిరిగా ఈ వీడియోలో జీఎస్టీ గురించి బచ్చన్ వివరించారు.

' ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్' ను సృష్టించే విధంగా జీఎస్టీ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అతిపెద్ద పన్ను వ్యవస్థను ఇంకొన్ని రోజుల్లో అమలు చేయనున్న నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి మెగాస్టార్ ఈ ప్రమోషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. జీఎస్టీకి అంతకముందు బ్రాండ్ అంబాసిడర్  గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ నిర్వహించారు. నాలుగు శ్లాబు రేట్లతో ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకురాబోతుంది. అవసరమైన వస్తువులకు 5 శాతం, కార్లు, కన్జూమర్ డ్యూరెబుల్స్ అత్యధికంగా 28 శాతం పన్ను రేట్లను వేయనున్నారు. మిగతావస్తువులు 12, 18 శాతం పరిధిలోకి రానున్నారు. ఈ పన్ను విధానం అమలు ప్రక్రియ గురించి  ఇప్పటికే, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 17 సార్లు భేటీ అ‍య్యాయి.

Advertisement
Advertisement