నష్టాల బాటలో ఇన్‌ఫ్రా... | Sakshi
Sakshi News home page

నష్టాల బాటలో ఇన్‌ఫ్రా...

Published Sat, Feb 14 2015 2:30 AM

నష్టాల బాటలో ఇన్‌ఫ్రా...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  617... 267... 172... ఇవి క్రికెట్ స్కోర్లు కావు. మూడు నెలల్లో రాష్ట్ర ఇన్‌ఫ్రా కంపెనీలు మూటకట్టుకున్న కోట్ల నష్టాలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ల్యాంకో, జీవీకే, ఐవీఆర్‌సీఎల్ కంపెనీలు శుక్రవారంనాడు వరుసగా ప్రకటించిన నష్టాలివి. ఇంతటి భారీ నష్టాలు రావడానికి కారణం ఈ కంపెనీలు ఈ మూడు నెలల కాలంలో రుణాలపై వరుసగా రూ.744 కోట్లు, రూ.352 కోట్లు, రూ.159 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి రావటమే. దీనికి తోడు జీవీకే, ల్యాంకో ఇన్‌ఫ్రాలు గ్యాస్ కొరతతో విద్యుదుత్పత్తి చేయకపోవటం వల్ల నష్టాలు మరింత పెరిగాయి.
 
ఐవీఆర్‌సీఎల్ నష్టం రూ. 172 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో ఐవీఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా ఆదాయంతో పాటు నష్టాలు తగ్గాయి.  ఆదాయం రూ. 956 కోట్ల నుంచి రూ. 645 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 172 కోట్లకు తగ్గాయి. 9 నెలల కాలంలో కంపెనీ రూ. 2,090 కోట్ల ఆదాయంపై రూ.517 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ చేతిలో రూ.17,135 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.
శుక్రవారం ఐవీఆర్‌సీఎల్ షేరు స్వల్ప నష్టాలతో రూ.16.65 వద్ద ముగిసింది.
 
మరింత పెరిగిన జీవీకే నష్టాలు
జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీవీకేపీఐఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 209 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ నష్టాలు రూ.45 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ.735 కోట్ల నుంచి రూ.792 కోట్లకు పెరిగింది. గ్యాస్ సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వడ్డీ భారం కారణంగా నష్టాలు భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. జీవీకే వరుసగా 13 త్రైమాసికాల నుంచి నష్టాలను ప్రకటిస్తోంది. ఎయిర్‌పోర్ట్ విభాగంలో ఆదాయం రూ. 547 కోట్ల నుంచి రూ.602 కోట్లకు చేరింది.
శుక్రవారం జీవీకే ఇన్ ఫ్రా షేరు 4% నష్టాలతో రూ. 9.90 వద్ద ముగిసింది.

ల్యాంకో నష్టం రూ. 617 కోట్లు
క్యూ3లో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ రూ. 617 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి రూ. 530 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,588 కోట్ల నుంచి రూ. 2,253 కోట్లకు తగ్గింది. గ్యాస్ కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయలేకపోవడం, వడ్డీ భారం, కొత్త ప్రాజెక్టుల జారీలో ఆలస్యం వంటివి నష్టాలు పెరగడానికి కారణంగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ల్యాంకో చేతిలో రూ. 29,464 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.
 శుక్రవారం ల్యాంకో ఇన్‌ఫ్రా షేరు 1% నష్టంతో రూ. 6 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement