ఆసుపత్రిని, డాక్టర్ని మార్చినట్టే...హెల్త్ పాలసీనీ మార్చేయొచ్చు! | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిని, డాక్టర్ని మార్చినట్టే...హెల్త్ పాలసీనీ మార్చేయొచ్చు!

Published Mon, Sep 5 2016 12:37 AM

ఆసుపత్రిని, డాక్టర్ని మార్చినట్టే...హెల్త్ పాలసీనీ మార్చేయొచ్చు!

బీమా పోర్టబిలిటీతో కంపెనీ మారే అవకాశం
అదే కంపెనీలో వేరే పాలసీకి కూడా మారొచ్చు
కొన్ని పరిమితులతో ప్రయోజనాలన్నీ బదలాయింపు
పాత పాలసీ ప్రీమియానికి 45 రోజుల గడువుంటే చాలు
15 రోజుల్లోపు పోర్టబిలిటీపై కొత్త కంపెనీ తేల్చాల్సిందే

మారిన పరిస్థితుల్లో ఎప్పుడు ఏ కారణంతో ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుందో చెప్పలేం. ఒకవేళ ఆసుపత్రిలో చేరటమంటూ జరిగితే... ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుందో కూడా ఊహించటం కూడా కష్టం. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. కాకపోతే ఇక్కడో విషయం. ఆసుపత్రిలో చేరాక సరైన సేవలు లభించకపోవటమో, మంచి వైద్యులు లేకపోవటమో జరిగిందనుకోండి!! ఏం చేస్తాం? ఆసుపత్రిని మార్చేస్తాం. మరి ఎన్నో అంచనాలతో బీమా పాలసీ తీసుకున్నాక ప్రీమియం, సదుపాయాలు, సేవల విషయంలో అసంతృప్తి ఎదురైతే..? సర్దుకుపోవాల్సిన అవసరం అక్కడ కూడా లేదు. ఇన్సూరెన్స్ పోర్టబిలిటీతో మంచి సేవలందిస్తున్న మరో పాలసీకి, లేదంటే మరో బీమా కంపెనీకి ఎంచక్కా మారిపోవచ్చు. దానిపై అవగాహన  కోసమే ఈ ప్రత్యేక కథనం...      - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం

బీమా పోర్టబిలిటీతో అన్నిటికన్నా ప్రధానమైన ప్రయోజనమేంటంటే... ప్రస్తుత పాలసీ ద్వారా అందుతున్న ప్రయోజనాలు, దాన్లోని మినహాయింపులు అన్నీ పోర్టబిలిటీ ద్వారా వేరే పాలసీకి బదలాయించుకునే హక్కు పాలసీదారులకుంటుంది. ఉదాహరణకు ఒక పాలసీ తీసుకున్నాక మూడేళ్లు కొనసాగించిన తరవాతే ముందు నుంచీ ఉన్న కొన్నిరకాల వ్యాధులకు కవరేజీ లభిస్తుంది. మరి పాలసీ తీసుకున్న రెండేళ్లకే అది నచ్చక పాలసీ పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారనుకోండి!! కొత్త పాలసీలో మరో మూడేళ్లు కొనసాగాల్సిన అవసరం లేదు. ఒక ఏడాది కొనసాగితే మూడేళ్లూ పూర్తవుతాయి. ఇక మూడేళ్లు దాటిన తరవాత వేరే పాలసీకో, కంపెనీకో బదిలీ అయితే... ముందు నుంచీ ఉన్న వ్యాధులకు అక్కడ ఆరంభం నుంచీ కవరేజీ లభిస్తుంది. అంటే బీమా కాలం కూడా బదిలీ అవుతుందన్న మాట.

 ఏ పాలసీలకు పోర్టబిలిటీ..?
అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు పోర్టబిలిటీ సదుపాయం ఉంది. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పోర్టబిలిటీ అన్నది పూర్తి స్థాయిలో ఉండదు. అదే బీమా కంపెనీ అందిస్తున్న వ్యక్తిగత ప్లాన్‌కు మాత్రం మారిపోవచ్చు.

పోర్టబిలిటీ ఎప్పుడు కావాలి..!
ప్రస్తుత ఆరోగ్య బీమా కంపెనీ సేవలు,  చెల్లింపుల చరిత్ర సంతృప్తికరంగా లేకపోయినా...

ప్రస్తుత కవరేజీ అన్ని వ్యాధులకూ సరిపోదని భావించి కవరేజీ పెంచుకోవాలని భావించారనుకోండి. కోరుకున్న మేర కవరేజీ పెంచేందుకు ప్రస్తుత బీమా కంపెనీ అంగీకరించకపోతే..

ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీ కంటే అధిక ప్రయోజనాలతో కాస్త తక్కువ ప్రీమియానికే మరో మంచి పాలసీ అందుబాటులో ఉంటే...

ముందుగా తెలియజేయాలి...
పోర్టబిలిటీ ద్వారా పాలసీ మార్చుకోవాలని అనుకుంటే... ప్రస్తుత పాలసీ ప్రీమియం చెల్లించడానికి కనీస గడువు 45 రోజులుండాలి. ఈ గడువు 60 రోజులకు మించకూడదు. ఆ లోపే దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన కాల వ్యవధిలో పోర్టబిలిటీకి అనుమతించరు. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి ప్రీమియం చెల్లించాల్సిన తేదీకి మధ్య వ్యవధి 45 రోజుల కంటే తక్కువగా ఉంటే పోర్టబిలిటీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది.

వ్యక్తిగత పాలసీ టు ఫ్లోటర్ పాలసీ
ప్రస్తుతం ఒంటరి వ్యక్తిగా ఇండివిడ్యువల్ పాలసీ తీసుకుని ఉన్నారనుకోండి. త్వరలో వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతున్నారు!!. అలాంటప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం. ఇండివిడ్యువల్ పాలసీ ఆ అవసరాలను తీర్చలేదు కనుక పోర్టబిలిటీ ద్వారా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి మారిపోవచ్చు. అయితే, వ్యక్తిగత పాలసీలో అప్పటి వరకు ఉన్న ప్రయోజనాలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి బదిలీ కావు.

పోర్టబిలిటీ పెండింగ్‌లో ఉంటే?
ప్రస్తుత పాలసీ ప్రీమి యం చెల్లింపు తేదీకి 45 రోజుల ముందే పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కొత్త కంపెనీ దాన్నింకా ఆమోదించలేదు. మరోవంకేమో ప్రస్తుత పాలసీ చెల్లింపు గడువు సమీపిస్తోంది. అప్పుడు ప్రస్తుత పాలసీ గడువును పొడిగించాలని కోరవచ్చు. అయితే, ఈ పెంపు 30 రోజుల వరకే పరిమితం. ప్రీమియం కూడా 30 రోజులకే వసూలు చేస్తారు. ఒకవేళ ఈ 30 రోజుల్లో ఏదైనా అనుకోని సందర్భం ఎదురై క్లెయిమ్ అవసరం ఏర్పడితే నిబంధనల మేరకు కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అయితే, అప్పుడు పూర్తి ఏడాదికి ప్రీమియం చెల్లించి, ఆ ఏడాదంతా అదే కంపెనీలో కొనసాగాల్సి ఉంటుంది. కావాలంటే ఏడాది తర్వాత పోర్టబిలిటీకి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కంపెనీ పోర్టబిలిటీ దరఖాస్తును ఆమోదించే వరకూ ప్రస్తుత పాలసీ రద్దు కాదు.

ఇలా అయితే పోర్టబిలిటీకి అడ్డంకే...
ప్రస్తుతం కొనసాగిస్తున్న పాలసీకి ప్రీమియం సకాలంలో చెల్లించడంలో విఫలమైన సందర్భాలున్నాయనుకోండి. అపుడు పోర్టబిలిటీ కష్టమే. అంటే సాధారణ చెల్లింపు తేదీతోపాటు, 30 రోజుల గ్రేస్ పీరియడ్ లోపల కూడా చెల్లించడంలో విఫలమైతే (బ్రేక్) పోర్టబిలిటీకి అనర్హుల కిందే లెక్క.

Advertisement

తప్పక చదవండి

Advertisement