ఇక డివిడెండ్‌ షేర్లపై దృష్టి పెట్టవచ్చా? | Sakshi
Sakshi News home page

ఇక డివిడెండ్‌ షేర్లపై దృష్టి పెట్టవచ్చా?

Published Thu, Jul 2 2020 2:52 PM

High Dividend yield stocks to invest: experts view - Sakshi

కోవిడ్‌-19 ధాటికి మార్చిలో కుదేలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి ఒక్కసారిగా జోరందుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలతో వ్యవస్థలో లిక్విడిటీ భారీగా పెరిగింది. దీంతో చౌక నిధులు మార్కెట్లలోకి ప్రవహిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కొన్ని బ్లూచిప్‌ కంపెనీలు సానుకూల ఫలితాలు సాధించడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు తెలియజేశారు. ఇటీవల డిజిటల్‌, టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించింది. తద్వారా ఫేస్‌బుక్‌సహా పలు విదేశీ దిగ్గజాలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులకు క్యూకట్టడంతో టెలికం రంగ కంపెనీలకు జోష్‌వచ్చినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అంతర్గతంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక డివిడెండ్లు చెల్లించే బలమైన కంపెనీలవైపు కొంతవరకూ దృష్టిసారించవచ్చని తెలియజేస్తున్నారు. వివరాలు చూద్దాం..

ఫిక్స్‌డ్‌ కంటే అధికం
ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై దాదాపుగా 4-6 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే పటిష్ట ఫండమెంటల్స్‌ కలిగి అధిక డివిడెండ్లు పంచే కంపెనీలు ఇంతకంటే అధిక రిటర్నులు అందించగలవని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో అమలైన డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) స్థానే ప్రస్తుతం వీటిని అందుకునే వాటాదారులు, ఇన్వెస్టర్లపై పన్ను పడుతోంది. డివిడెండ్‌ మొత్తం రూ. 5000 మించితే కంపెనీలు మూలం వద్దే పన్ను(టీడీఎస్‌) విధిస్తాయి. దేశీ ఇన్వెస్టర్లపై 10 శాతం, ఎన్‌ఆర్‌ఐలపై 20 శాతం చొప్పున డివిడెండ్లపై పన్ను విధింపు ఉంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇలా చూస్తే కొన్ని కంపెనీలు చెల్లించే డివిడెండ్లు బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకంటే అధిక ఈల్డ్స్‌(రిటర్నులు) అందించగలవని అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాలన్స్‌షీట్‌, పటిష్ట ఫండమెంటల్స్‌ కలిగిన కొన్ని కంపెనీలు అధిక డివిడెండ్లను చెల్లిస్తుంటాయని.. ఇలాంటి కౌంటర్లవైపు కొంతమేర పెట్టుబడులను మళ్లించవచ్చని సూచిస్తున్నారు.

పీఎస్‌యూలు 
నిజానికి పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అధిక డివిడెండ్లను పంచుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, కంకార్‌, ఆర్‌ఈసీ తదితర దిగ్గజాలు భారీ డివిడెండ్లను చెల్లించినట్లు తెలియజేశారు. ప్రయివేట్‌ రంగంలో సాధారణంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఎంఎన్‌సీలు అధిక డివిడెండ్లను ప్రకటిస్తుంటాయని పేర్కొన్నారు. అయితే గతంతో భవిష్యత్‌ను పోల్చతగదని.. ఇకపై కోవిడ్‌-19 పరిస్థితుల్లోనూ అధిక డివిడెండ్లను పంచగల సత్తా తక్కువ కంపెనీలకే ఉంటుందని తెలియజేశారు. లాక్‌డవున్‌, ఆర్థిక మందగమనం, డిమాండ్‌ క్షీణత తదితర ప్రతికూలతలతో పలు రంగాల కంపెనీలకు పెట్టుబడుల అవశ్యకత పెరుగుతుందని, దీంతో డివిడెండ్‌ చెల్లింపులు తగ్గే వీలున్నదని ఐడీబీఐ ‍క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ వివరించారు. ఐటీ కంపెనీలు సైతం నగదును డివిడెండ్‌, బైబ్యాక్‌ల నుంచి ఇతర అవసరాలకు వినియోగించేందుకు ప్రణాళికలు వేస్తున్న అంశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు.

ఐటీసీ భళా
వడ్డీ రేట్లు, మార్కెట్‌ అనిశ్చితులు వంటి అంశాలను పరిగణిస్తే.. 4-6 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌ ఇచ్చే కంపెనీలలో పెట్టుబడులు తెలివైన నిర్ణయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయివేట్‌ రంగంలో ఇటీవల ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడిస్తూ.. వాటాదారులకు షేరుకి రూ. 10.15 డివిడెండ్‌ను ప్రకటించింది. ఇది 5 శాతం ఈల్డ్‌కు సమానంకాగా.. గత రెండు నెలల్లో ఐటీసీ షేరు 17 శాతం ర్యాలీ చేసింది. 

అధిక ఈల్డ్స్‌ ఇలా
గతేడాది అధిక డివిడెండ్లు పంచిన కంపెనీలలో ఎస్‌కేఎఫ్‌, హడ్కో, బామర్‌ లారీ, ఆర్‌సీఎఫ్‌ తదితరాలు చోటుచేసుకున్నాయి. ఎస్‌కేఎఫ్‌ దాదాపు 8 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌ అందించగా.. హడ్కో, బామర్‌ లారీ, ఆర్‌సీఎఫ్‌, హెచ్‌ఎస్‌ఐఎల్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌, టిమ్‌కెన్‌ ఇండియా 7-5 శాతం మధ్య డివిడెండ్‌ రిటర్నులు ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర కౌంటర్లలో కొచిన్‌ షిప్‌యార్డ్‌, జీఎండీసీ వంటి కంపెనీలు సైతం 5 శాతం ఈల్డ్‌కు కారణమైనట్లు తెలియజేశారు. అయితే భవిష్యత్‌లో అధిక డివిడెండ్లు ప్రకటించగల రంగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవలసి ఉంటుందని ప్రభాకర్‌ సలహా ఇస్తున్నారు.

Advertisement
Advertisement