డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి 5 శాతమే! | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి 5 శాతమే!

Published Fri, Jan 6 2017 1:14 AM

డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి 5 శాతమే!

నోట్ల రద్దు ప్రభావంపై హెచ్‌ఎస్‌బీసీ నివేదిక
ఫిబ్రవరిలో పావుశాతం రేటు కోత అంచనా
 

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసిక దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్రంగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతంగానే నమోదవుతుందని నివేదిక అంచనావేసింది. తరువాతి త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఈ రేటు 6 శాతమని విశ్లేషించింది. డీమోనిటైజేషన్‌ వల్ల తయారీ, సేవల రంగాలు భారీగా నష్టపోతున్నట్లు పేర్కొంది.

నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...
తయారీ, సేవలు, వినియోగం, పెట్టుబడులు... ఇలా కీలక రంగాలన్నింటిపై నవంబర్‌ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ప్రకటన ప్రభావం పడింది.
డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేట్ల తాజా అంచనా వరుసగా 5, 6 శాతాలు. ఇవి ఇంతక్రితం అంచనాలకన్నా 2% తక్కువ.
మార్చి తరువాత ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకునే వీలుంది. తిరిగి వృద్ధి రేటు 7% దిశగా పయనించవచ్చు.  మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.5%–8% శ్రేణిలో ఉండవచ్చు. వ్యాపార వ్యయాల సర్దుబాటు, వినియోగ విశ్వాసం పెరుగుదల, డిజిటలైజేషన్‌ వంటి అంశాలు ఇందుకు దోహదపడతాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వృద్ధి లక్ష్యంగా సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభించే వీలుంది. పెట్టుబడులు పెరగడం లక్ష్యంగా ఫిబ్రవరిలో పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) తగ్గించే వీలుంది. ఫిబ్రవరి 8న ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమావేశం కావడం గమనార్హం.

ఫిబ్రవరిలో రేటు కోత ఉండకపోవచ్చు...: ఎస్‌బీఐ నివేదిక
మరోవైపు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన పరిశోధనా నివేదికలో ఫిబ్రవరి 8న ఆర్‌బీఐ రేటు కోత ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులే దీనికి కారణమని వివరించింది. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండే వీలుందని పేర్కొంటూ, డిసెంబర్‌లో ఈ శాతం 3.2 శాతం – 3.3 శాతం శ్రేణిలో ఉండవచ్చని అభిప్రాయపడింది. మార్చి త్రైమాసికంలో కొంత పెరిగినా 4 నుంచి 4.5 శాతం శ్రేణికి మించకపోవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగిన ఆమోదనీయ స్థాయిలో కొనసాగిన పక్షంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో రేటుకు సానుకూలంగా ఆర్‌బీఐ స్పందించే వీలుందని అభిప్రాయపడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement